సర్ఫరాజ్‌ సెంచరీ

రంజీ ఫైనల్‌ ఆసక్తికరంగా సాగుతోంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (134; 243 బంతుల్లో 13×4, 2×6) చక్కని శతకం సాధించడంతో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌ కూడా రెండో రోజును సంతోషంగానే ముగించింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు

Published : 24 Jun 2022 01:51 IST
ముంబయి 374
మధ్యప్రదేశ్‌ 123/1
రంజీ ఫైనల్‌
బెంగళూరు

రంజీ ఫైనల్‌ ఆసక్తికరంగా సాగుతోంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (134; 243 బంతుల్లో 13×4, 2×6) చక్కని శతకం సాధించడంతో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌ కూడా రెండో రోజును సంతోషంగానే ముగించింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 123 పరుగులు చేసింది. గురువారం ఆటలో సర్ఫరాజ్‌ (ఓవర్‌నైట్‌ 40) ఇన్నింగ్సే హైలైట్‌. ఓవర్‌నైట్‌ స్కోరు 248/5తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబయి.. మెరుగైన స్కోరు సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. మరో ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ ములాని (12) తన స్కోరుకు ఒక్క పరుగు జోడించకుండానే నిష్క్రమించినా.. సర్ఫరాజ్‌ పరిణతితో బ్యాటింగ్‌ చేశాడు. టెయిలెండర్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. చక్కని షాట్లతో అలరించిన అతడు.. తనుష్‌ (15)తో ఏడో వికెట్‌కు 48, ధవల్‌ కులకర్ణి (1)తో ఎనిమిదో వికెట్‌కు 26, తుషార్‌ దేశ్‌పాండే (6)తో తొమ్మిదో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. మోహిత్‌ అవస్థి (7 నాటౌట్‌)తో మరో విలువైన భాగస్వామ్యాన్ని (21) నెలకొల్పిన సర్ఫరాజ్‌.. చివరి వికెట్‌గా నిష్క్రమించాడు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో గౌరవ్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అనుభవ్‌ అగర్వాల్‌ మూడు వికెట్లు చేజిక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ దీటుగా స్పందించింది. యశ్‌ దూబె (44 బ్యాటింగ్‌), శుభమ్‌ శర్మ (41 బ్యాటింగ్‌) అభేద్యమైన రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. దూబె అంతకుముందు హిమాంశు మంత్రి (31)తో తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు.

సంక్షిప్త స్కోర్లు... ముంబయి తొలి ఇన్నింగ్స్‌: 374 (సర్ఫరాజ్‌ 134, యశస్వి జైస్వాల్‌ 78, పృథ్వీ షా 47, అర్మాన్‌ జాఫర్‌ 26, హార్దిక్‌ తమోరె 24; గౌరవ్‌ యాదవ్‌ 4/106, అనుభవ్‌ అగర్వాల్‌ 3/81, సారాంశ్‌ జైన్‌ 2/47);

మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 123/1 (యశ్‌ దూబె 44 బ్యాటింగ్‌, శుభమ్‌ శర్మ 41 బ్యాటింగ్‌, హిమాంశు 31; తుషార్‌ 1/31)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని