Updated : 27 Jun 2022 09:07 IST

IND vs IRL: కూనపై అలవోకగా..

హుడా మెరుపు ఇన్నింగ్స్‌ 

రాణించిన హార్దిక్‌, భువి, చాహల్‌

తొలి టీ20లో ఐర్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం

డబ్లిన్‌

 

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం వరుణుడు ప్రభావం చూపిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. దీపక్‌ హుడా (47 నాటౌట్‌; 29 బంతుల్లో 6x4, 2x6), ఇషాన్‌ కిషన్‌ (26; 11 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌ పాండ్య (24; 12 బంతుల్లో 1x4, 3x6) చెలరేగడంతో 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో యంగ్‌ (2/18) ఒక్కడే ప్రభావం చూపాడు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌.. 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ కుమార్‌ (3-1-16-1), చాహల్‌ (3-0-11-1) ప్రత్యర్థిని కట్టడి చేశారు. హ్యారీ టెక్టార్‌ (64 నాటౌట్‌; 33 బంతుల్లో 6x4, 3x6) ఆతిథ్య జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది.

ఛేదన.. ధనాధన్‌:

ఛేదనలో ఇషాన్‌ కిషన్‌.. భారత్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. లిటిల్‌ వేసిన తొలి ఓవర్లో మూడో బంతి నుంచి వరుసగా 4, 6, 4 బాదేశాడు. యంగ్‌ వేసిన మూడో ఓవర్లోనూ అతను వరుసగా 4, 6 కొట్టాడు. కానీ నాలుగో బంతికి యంగ్‌ అతణ్ని బౌల్డ్‌ చేశాడు. తర్వాతి బంతికే సూర్యకుమార్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పవనిపించింది. కానీ హార్దిక్‌, హుడా ఐర్లాండ్‌కు అవకాశం ఇవ్వలేదు. వెంట వెంటనే రెండు వికెట్లు పడ్డప్పటికీ.. ఆ ప్రభావమే కనిపించనివ్వకుండా ఇద్దరూ ధాటిగా ఆడారు. దీంతో మెక్‌బ్రైన్‌ వేసిన ఆరో ఓవర్లో హార్దిక్‌ 2 సిక్సర్లు బాదితే.. హుడా ఒక సిక్స్‌ కొట్టాడు. లిటిల్‌ వేసిన 8వ ఓవర్లో హుడా రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదాడు. కానీ అదే ఓవర్‌ చివరి బంతికి హార్దిక్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కార్తీక్‌ (5 నాటౌట్‌)తో కలిసి హుడా మిగతా పని పూర్తి చేశాడు.

టెక్టార్‌ ఒక్కడే..:

మ్యాచ్‌ మొదలైన తీరు చూస్తే.. ఐర్లాండ్‌ 108 పరుగులు చేయడం గొప్ప విషయమే. భువనేశ్వర్‌ ఇన్నింగ్స్‌ అయిదో బంతికే ఆ జట్టు కెప్టెన్‌ బాల్‌బిర్నీ (0)ని బౌల్డ్‌ చేసి జట్టుకు శుభారంభాన్నందించాడు. తర్వాతి ఓవర్లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (1/26).. స్టిర్లింగ్‌ (4)ను పెవిలియన్‌ చేర్చాడు. డెలానీ (8)ని అవేష్‌ తన తొలి ఓవర్లోనే వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో వెనక్కి పంపడంతో ఐర్లాండ్‌ 22/3తో కష్టాల్లో పడింది. అయితే టెక్టార్‌ భారత బౌలర్లపై ఎదురు దాడి చేయడం.. టకర్‌ (18) కూడా అతడికి సహకరించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లకు స్కోరు 69/3. హార్దిక్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది ఊపుమీద కనిపించిన టకర్‌.. చాహల్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. టెక్టార్‌ చివరి దాకా దూకుడు కొనసాగించడంతో ఐర్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున సత్తా చాటిన యువ పేసర్‌ ఉమ్రాన్‌మాలిక్‌ ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా.. టాస్‌ పడ్డ కాసేపటికే వరుణుడి ప్రతాపం మొదలవడంతో ఆట సాధ్యం కాలేదు. మధ్యలో వర్షం ఆగి ఆట ఆరంభమయ్యేలా కనిపించినా, మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. చివరికి నిర్ణీత సమయం కంటే 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది. తర్వాత వర్షం అంతరాయం కలిగించలేదు.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: స్టిర్లింగ్‌ (సి) హుడా (బి) హార్దిక్‌ 4; బాల్‌బిర్నీ (బి) భువనేశ్వర్‌ 0; గారెత్‌ (సి) కార్తీక్‌ (బి) అవేశ్‌ 8; టెక్టార్‌ నాటౌట్‌ 64; టకర్‌ (సి) అక్షర్‌ (బి) చాహల్‌ 18; డాక్రెల్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (12 ఓవర్లలో 4 వికెట్లకు) 108: వికెట్ల పతనం: 1-1, 2-6, 3-22, 4-72; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-1-16-1; హార్దిక్‌ పాండ్య 2-0-26-1; అవేశ్‌ ఖాన్‌ 2-0-22-1; అక్షర్‌ పటేల్‌ 1-0-12-0; ఉమ్రాన్‌ మాలిక్‌ 1-0-14-0; చాహల్‌ 3-0-11-1

భారత్‌ ఇన్నింగ్స్‌: దీపక్‌ హుడా నాటౌట్‌ 47; కిషన్‌ (బి) యంగ్‌ 26; సూర్యకుమార్‌ ఎల్బీ (బి) యంగ్‌ 0; హార్దిక్‌ ఎల్బీ (బి) లిటిల్‌ 24; కార్తీక్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (9.2 ఓవర్లలో 3 వికెట్లకు) 111; వికెట్ల పతనం: 1-30, 2-30, 3-94; బౌలింగ్‌: లిటిల్‌ 2.2-0-39-1; అడైర్‌ 2-0-14-0; యంగ్‌ 2-0-18-2; మెక్‌బ్రైన్‌ 1-0-21-0; ఓల్ఫర్ట్‌ 2-0-18-0

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని