Updated : 06 Aug 2022 05:31 IST

Cricket news: అదిగో.. ఇంకో సిరీస్‌ విజయం!

వెస్టిండీస్‌తో భారత్‌ ఢీ

నాలుగో టీ-20 నేడే : రాత్రి 8 నుంచి

ఫోర్ట్‌ లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా): ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ను వన్డేల్లో, టీ20ల్లో మట్టి కరిపించి వెస్టిండీస్‌లో అడుగు పెట్టిన టీమ్‌ఇండియా.. ఇప్పటికే అక్కడ వన్డే సిరీస్‌ గెలిచేసింది. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసి, 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక పొట్టి క్రికెట్లోనూ సిరీస్‌ అందుకోవడమే మిగిలింది. ఆ లక్ష్యంతోనే శనివారం నాలుగో టీ20లో బరిలోకి దిగుతోంది భారత్‌. రెండో టీ20లో తడబడ్డా వెంటనే పుంజుకుని విండీస్‌పై ఘనవిజయం సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. మూడో టీ20లో నడుం దగ్గర కండరాలు పట్టేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్‌ రోహిత్‌ కోలుకున్నాడని, ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాల సమాచారం. రోహిత్‌, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, కార్తీక్‌ మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. మూడో స్థానంలో ఆడుతున్న శ్రేయస్‌ సత్తా చాటకపోవడం ఒక్కటే సమస్యే. గత మ్యాచ్‌ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్‌ హుడాకు ఈసారి ఎక్కువ సమయం క్రీజులో గడిపే అవకాశం వస్తుందేమో చూడాలి. బౌలింగ్‌లో భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌ సత్తా చాటుతున్నారు. అవేష్‌ ఖాన్‌ విఫలమవుతున్న నేపథ్యంలో అశ్విన్‌కు తోడుగా మరో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను ఆడించే అవకాశలున్నాయి. ఈ మ్యాచ్‌ ఓడితే వరుసగా రెండో సిరీస్‌ కూడా చేజారే స్థితిలో ఉన్న విండీస్‌ గట్టిగా పోరాడుతుందనడంలో సందేహం లేదు. మేయర్స్‌, కింగ్‌, పూరన్‌, పావెల్‌, హెట్‌మయర్‌లతో బ్యాటింగ్‌ మెరుగ్గానే ఉన్నా.. బౌలింగ్‌ ఆ జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌ ముగిసిన 24 గంటల్లోపే భారత్‌.. విండీస్‌తో అయిదో టీ20 కూడా ఆడేయబోతుండటం విశేషం. ఈ రెండు మ్యాచ్‌లూ అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్నాయి. గతంలోనూ ఇక్కడ భారత్‌, వెస్టిండీస్‌ తలపడ్డాయి. పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఇక్కడ టీమ్‌ఇండియాకు సొంత మైదానంలో ఆడుతున్న భావన కలగొచ్చు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని