అలా మొదలెట్టి..

ఎల్దోస్‌ పాల్‌. నిన్నమొన్నటి వరకు వినిపించని ఈ పేరు ఇప్పుడు భారత క్రీడా వర్గాల్లో మార్మోగుతోంది. కామన్వెల్‌ క్రీడల ట్రిపుల్‌ జంప్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన ఈ కేరళ కుర్రాడి ప్రస్థానం స్ఫూర్తిదాయకం.

Updated : 08 Aug 2022 04:00 IST

ఎల్దోస్‌ పాల్‌. నిన్నమొన్నటి వరకు వినిపించని ఈ పేరు ఇప్పుడు భారత క్రీడా వర్గాల్లో మార్మోగుతోంది. కామన్వెల్‌ క్రీడల ట్రిపుల్‌ జంప్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన ఈ కేరళ కుర్రాడి ప్రస్థానం స్ఫూర్తిదాయకం. నాలుగేళ్ల వయసులోనే తల్లి మరణించింది. తండ్రి పని కల్లు దుకాణంలో. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు ఎల్దోస్‌. మొదట కాలేజ్‌లో మొదటి సంవత్సరంలో ఉండగా తనకన్నా ఇద్దరు మెరుగైన జంపర్లు ఉండడంతో విశ్వవిద్యాలయ స్థాయిలో పోటీలకు అతడు ఎంపిక కాలేదు. ఎల్దోస్‌కు పోల్‌ వాల్ట్‌, క్రాస్‌ కంట్రీ పోటీల్లో పాల్గొనడానికే అవకాశం లభించింది. దీంతో అతడు అప్పటికి ఆ పోటీలపైనే దృష్టిపెట్టాడు. కానీ అతడి లక్ష్యం మాత్రం ట్రిపుల్‌ జంపే. ఫలితంగా రెండో సంవత్సరంలో నిర్వహించిన ట్రిపుల్‌ జంప్‌ ట్రయల్స్‌లో ఎల్దోస్‌ అగ్రస్థానం సాధించాడు. ఆ తర్వాత యూనివర్సిటీ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా గత సంవత్సరంలో చాలా మెరుగయ్యాడు. 2021 మధ్య నాటికి 16.58 మీటర్లుగా ఉన్న అతడి జంప్‌ ఈ ఏడాది ఫెడరేషన్‌ కప్‌లో 16.99కి చేరుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో 16.79 మీటర్లతో తొమ్మిదో స్థానంలో నిలవడం అతడి కెరీర్‌లో అత్యుత్తమ దశ. అందరు ట్రిపుల్‌ జంపర్లలా మంచి ఎత్తులేకపోయినా ఎల్దోస్‌ అంత పురోగతి సాధించడం చాలా గొప్ప విషయం అంటాడు అతడి కోచ్‌ హరికృష్ణన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని