జకోవిచ్‌.. యుఎస్‌ ఓపెన్‌లో ఆడేనా?

టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఈ ఏడాదిలో చివరి గ్రాండ్‌స్లామ్‌ యుఎస్‌ ఓపెన్‌లో పోటీపడడం అనుమానంగా మారింది. అతను కరోనా టీకా వేసుకోకపోవడమే అందుకు కారణం.

Published : 14 Aug 2022 03:58 IST

టీకా వేసుకోలేదని సిన్సినాటి టోర్నీకి దూరం

సిన్సినాటి: టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఈ ఏడాదిలో చివరి గ్రాండ్‌స్లామ్‌ యుఎస్‌ ఓపెన్‌లో పోటీపడడం అనుమానంగా మారింది. అతను కరోనా టీకా వేసుకోకపోవడమే అందుకు కారణం. తాజాగా యుఎస్‌ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహించే సిన్సినాటి మాస్టర్స్‌ టోర్నీకి అతను దూరమయ్యాడు. ప్రస్తుతానికి టీకా వేసుకోని విదేశీయులకు యుఎస్‌ఏలోకి అనుమతి లేదు. దీంతో సిన్సినాటి టోర్నీ కోసం అతను అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29న ఆరంభమయ్యే యుఎస్‌ ఓపెన్‌లోనూ అతను పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెన్నిస్‌ టోర్నీలకు దూరమైనా సరే కానీ టీకా మాత్రం వేసుకోనని 35 ఏళ్ల జకోవిచ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అతనాడకపోవడానికి కూడా అదే కారణం. అలాగే యుఎస్‌లో రెండు టోర్నీలకూ దూరమయ్యాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో 21 టైటిళ్లతో నాదల్‌ (22) తర్వాత రెండో స్థానంలో ఉన్న జకో.. యుఎస్‌ ఓపెన్‌లో ఆడాలంటే అక్కడి ప్రభుత్వం టీకా నిబంధనలు సడలించాల్సి ఉంటుంది. మరి అందుకు ప్రభుత్వం సమ్మతిస్తుందో లేదో చూడాలి. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే యుఎస్‌ టెన్నిస్‌ సంఘం కూడా తేల్చిచెప్పింది. యుఎస్‌ ఓపెన్‌లో బరిలో దిగుతాననే ఆశ ఇంకా తనకు ఉందని అతనంటున్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది అసాధ్యంగా కనిపిస్తోంది. అతను ఈ టోర్నీలో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. గతేడాది ఫైనల్లో మెద్వెదెవ్‌ చేతిలో ఓడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని