సఫారీతో టీ20 సిరీస్‌కూ షమి దూరం

కరోనా నుంచి ఇంకా కోలుకోని టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమి.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో అతను స్టాండ్‌బైగా ఉన్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం షమిని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లకు ఎంపిక చేశారు. కానీ కరోనా

Updated : 27 Sep 2022 04:02 IST

జట్టులోకి శ్రేయస్‌, షాబాజ్‌

దిల్లీ: కరోనా నుంచి ఇంకా కోలుకోని టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమి.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో అతను స్టాండ్‌బైగా ఉన్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం షమిని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లకు ఎంపిక చేశారు. కానీ కరోనా సోకడంతో అతని స్థానంలో ఆసీస్‌పై ఉమేశ్‌ను ఆడించారు. ఇప్పటికీ వైరస్‌ నుంచి షమి పూర్తిగా కోలుకోకపోవడంతో సఫారీ సేనతో టీ20లూ ఆడలేకపోతున్నాడు. ఈ సిరీస్‌కూ ఉమేశ్‌ జట్టులో కొనసాగనున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న హార్దిక్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ జట్టులోకి రానున్నట్లు సమాచారం. వెన్ను నొప్పి కారణంగా దీపక్‌ హుడా కూడా దూరమవడంతో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి రానున్నాడు. ‘‘కరోనా నుంచి షమి కోలుకోలేదు. అతనికి మరింత సమయం కావాలి. అందుకే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమయ్యాడు. హార్దిక్‌ను భర్తీ చేసే మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ లేడు. అందుకే షాబాజ్‌ జట్టులోకి వచ్చాడు’’ అని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి చెప్పాడు. మరోవైపు ఇరానీ కప్‌లో సౌరాష్ట్రతో తలపడే రెస్టాఫ్‌ ఇండియా జట్టును హనుమ విహారి నడిపించనున్నాడు!


ప్రాక్టీస్‌ షురూ: టీమ్‌ఇండియాతో మూడేసి చొప్పున టీ20, వన్డేలు ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టిన సఫారీ సేన ప్రాక్టీస్‌ మొదలెట్టింది. బుధవారం జరిగే తొలి టీ20 కోసం సోమవారం భారత జట్టు కూడా తిరువనంతపురం చేరుకుంది. రోహిత్‌ సేన మంగళవారం సాధన చేస్తుంది. 55 వేల సీట్ల సామర్థ్యం గల స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇంకా 2 వేల టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని కేరళ క్రికెట్‌ సంఘం వెల్లడించింది. మిగిలిన రెండు టీ20లు గువాహటి (అక్టోబర్‌ 2), ఇండోర్‌ (అక్టోబర్‌ 4)లో జరుగుతాయి. టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియా ఆడే ఆఖరి టీ20 సిరీస్‌ ఇదే. ఆ తర్వాత లఖ్‌నవూ, రాంచి, దిల్లీలో వన్డేలు నిర్వహిస్తారు. కానీ అక్టోబర్‌ 6న ఆరంభమయ్యే ఈ వన్డే సిరీస్‌కు భారత్‌.. ద్వితీయ శ్రేణి జట్టును ఆడిస్తుంది. వచ్చే నెల 4న టీ20 సిరీస్‌ ముగియగానే.. ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాకు భారత్‌ బయల్దేరనుంది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ధావన్‌ సారథ్యంలో మరో జట్టు బరిలో దిగుతుంది. శుభ్‌మన్‌, శాంసన్‌ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉండడం ఖాయం. ఈ ఏడాది ఐపీఎల్‌, దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటిన రజత్‌ పాటిదార్‌కు తొలిసారి జట్టు నుంచి పిలుపొచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని