IND vs NZ: వరుణుడు టై చేశాడు

వర్షంతో మొదలైన టీ20 సిరీస్‌ వర్షంతోనే ముగిసింది. వాన వల్ల చివరిదైన మూడో టీ20 చిత్రంగా డ/లూ విధానంలో టైగా ముగిసిన వేళ.. సిరీస్‌ భారత్‌ సొంతమైంది.

Updated : 23 Nov 2022 04:31 IST

మూడో టీ20కి వర్షం దెబ్బ
డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో మ్యాచ్‌ సమం
సిరీస్‌ 1-0తో భారత్‌ వశం

వర్షంతో మొదలైన టీ20 సిరీస్‌ వర్షంతోనే ముగిసింది. వాన వల్ల చివరిదైన మూడో టీ20 చిత్రంగా డ/లూ విధానంలో టైగా ముగిసిన వేళ.. సిరీస్‌ భారత్‌ సొంతమైంది.
ఫాస్ట్‌బౌలర్లు సిరాజ్‌, అర్ష్‌దీప్‌ అద్భుతమైన బౌలింగ్‌తో భారీ స్కోరు దిశగా సాగుతున్న కివీస్‌కు కళ్లెం వేసి భారత్‌ను పోటీలో నిలిపారు. ఛేదనలో తడబడ్డ టీమ్‌ఇండియాను కెప్టెన్‌ హార్దిక్‌ కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. వర్షం వల్ల ఇన్నింగ్స్‌ పూర్తి కాలేదు.

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య చివరిదైన మూడో టీ20 డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో టైగా ముగిసింది. మంగళవారం మొదట న్యూజిలాండ్‌ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్‌ (54; 33 బంతుల్లో 5×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్‌ కాన్వే (59; 49 బంతుల్లో 5×4, 2×6) రాణించాడు. భారీ స్కోరు చేసేలా కనిపించిన కివీస్‌ను సిరాజ్‌ (4/17), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/37) అదిరే బౌలింగ్‌తో కట్టడి చేశారు. ఛేదనలో భారత్‌ 9 ఓవర్లలో 75/4తో ఉన్న దశలో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది.  మళ్లీ ఆట సాధ్యం కాలేదు. డ/లూ పద్థతిలో అప్పటికి రెండు జట్లు స్కోరు సమంగా ఉండడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (30 నాటౌట్‌; 18 బంతుల్లో 3×4, 1×6) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. సిరాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. రెండో టీ20లో గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1-0తో చేజిక్కించుకుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.

మెరిసిన హార్దిక్‌: ఛేదనలో భారత టాప్‌ ఆర్డర్‌ తేలిపోయింది. 3 ఓవర్లలో 23/3తో టీమ్‌ఇండియా చిక్కుల్లో పడింది. ఓపెనర్లు ఇషాన్‌ (10), పంత్‌ (11) భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో ఔట్‌ కాగా.. సౌథీ షార్ట్‌ డెలివరీకి శ్రేయస్‌ (0) స్లిప్‌లో నీషమ్‌కు చిక్కాడు. అయితే సూర్య (13)తో కలిసిన హార్దిక్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో పరిస్థితిని చక్కదిద్దాడు. మిల్నె బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు.. సౌథీ ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ బాదేశాడు. ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టిన సూర్య ఏడో ఓవర్లో ఔటయ్యేటప్పటికి స్కోరు 60. ఆ తర్వాత దీపక్‌ హుడా (9 నాటౌట్‌)తో కలిసి హార్దిక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 9 ఓవర్లు ముగిసేసరికి వర్షం మొదలవడంతో ఆట నిలిచిపోయింది. 7 నుంచి 9 ఓవర్ల మధ్య ఒక బౌండరీ కూడా రాకపోవడం గమనార్హం. అయితే 9వ ఓవర్‌ చివరి బంతిని హుడా పాయింట్‌ వైపు ఆడగా.. ఆపడంలో శాంట్నర్‌ తడబడడంతో భారత్‌కు సింగిల్‌ వచ్చింది. మ్యాచ్‌లో అదే కీలకం. డక్‌వర్త్‌ ప్రకారం స్కోర్లను సమం చేసిన సింగిల్‌ అది.

సిరాజ్‌, అర్ష్‌దీప్‌ అదుర్స్‌: కివీస్‌ జోరు చూస్తే.. చివరికి ఆ జట్టు చేసిన 160 పరుగుల స్కోరు తక్కువే. ఆఖర్లో అసాధారణ బౌలింగ్‌తో సిరాజ్‌, అర్ష్‌దీప్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పకుంటే భారత్‌ ఇబ్బంది పడేదే. కివీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. అర్ష్‌దీప్‌ రెండో ఓవర్లోనే ఓ చక్కని స్వింగ్‌ డెలివరీతో ఫిన్‌ అలెన్‌ (3)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాన్వే చక్కగా బ్యాటింగ్‌ చేయడంతో కివీస్‌ 5 ఓవర్లలో 44/1తో నిలిచింది. తర్వాతి ఓవర్లో సిరాజ్‌ రెండే పరుగులిచ్చి చాప్‌మన్‌ (12)ను ఔట్‌ చేశాడు. అప్పుడొచ్చాడు క్రీజులోకి విధ్వంసక వీరుడు ఫిలిప్స్‌. మొదట్లో అతడూ జాగ్రత్తగానే ఆడాడు. ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అయితే మరోవైపు నిలకడగా ఆడుతున్న కాన్వే అండగా నిలవగా.. ఫిలిప్స్‌  క్రమంగా జోరందుకున్నాడు. భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చాహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతడు..  వెంటనే భువి బౌలింగ్‌లో వరుసగా 4, 6 దంచాడు. హర్షల్‌ ఓవర్లోనూ ఓ సిక్స్‌ కొట్టాడు. 15 ఓవర్లలో 129/2తో కివీస్‌ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ బంతితో భారత్‌ పుంజుకున్న తీరు అద్భుతం. సిరాజ్‌, అర్ష్‌దీప్‌ గొప్పగా బౌలింగ్‌ చేయడంతో చివరి అయిదు ఓవర్లలో కేవలం 31 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టిన భారత్‌.. బలంగా పోటీలోకి వచ్చింది. 16వ ఓవర్లో సిరాజ్‌.. ఫిలిప్స్‌ను ఔట్‌ చేయడం మలుపు. తర్వాతి ఓవర్లోనే కాన్వేను అర్ష్‌దీప్‌ వెనక్కి పంపాడు. 18వ ఓవర్లో సిరాజ్‌.. నీషమ్‌, శాంట్నర్‌ను ఔట్‌ చేశాడు. తర్వాతి ఓవర్లో అర్ష్‌దీప్‌ తొలి రెండు బంతుల్లో మిచెల్‌, సోధిలను ఔట్‌ చేయగా.. మూడో బంతికి మిల్నె రనౌటయ్యాడు. ఆఖరి ఓవర్లో సౌథీని హర్షల్‌ బౌల్డ్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: ఫిన్‌ అలెన్‌ ఎల్బీ (బి) అర్ష్‌దీప్‌ 3; కాన్వే (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అర్ష్‌దీప్‌ 59; చాప్‌మన్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) సిరాజ్‌ 12; ఫిలిప్స్‌ (సి) భువనేశ్వర్‌ (బి) సిరాజ్‌ 54; మిచెల్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 10; నీషమ్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 0; శాంట్నర్‌ (సి) చాహల్‌ (బి) సిరాజ్‌ 1; మిల్నె రనౌట్‌ 0; ఇష్‌ సోధి (బి) అర్ష్‌దీప్‌ 0; సౌథీ (బి) హర్షల్‌ 6; ఫెర్గూసన్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 160; వికెట్ల పతనం: 1-9, 2-44, 3-130, 4-146, 5-147, 6-149, 7-149, 8-149, 9-149; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-35-0; అర్ష్‌దీప్‌ 4-0-37-4; సిరాజ్‌ 4-0-17-4; దీపక్‌ హుడా 1-0-3-0; చాహల్‌ 3-0-35-0; హర్షల్‌ పటేల్‌ 3.4-0-28-1

భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) చాప్‌మన్‌ (బి) మిల్నె 10; పంత్‌ (సి) సోధి (బి) సౌథీ 11; సూర్యకుమార్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సోధి 13; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) నీషమ్‌ (బి) సౌథీ 0; హార్దిక్‌ నాటౌట్‌ 30; దీపక్‌ హుడా నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (9 ఓవర్లలో 4 వికెట్లకు) 75; వికెట్ల పతనం: 1-13, 2-21, 3-21, 4-60; బౌలింగ్‌: సౌథీ 3-0-27-2; మిల్నె 2-0-23-1; ఫెర్గూసన్‌ 1-0-8-0; ఇష్‌ సోధి 2-0-12-1; శాంట్నర్‌ 1-0-5-0

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని