దమ్ము చూపిన జమ్ము

విజయ్‌ హజారె ట్రోఫీలో జమ్ము కశ్మీర్‌ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. అద్భుతమైన ఆటతీరుతో సాగుతున్న ఆ జట్టు తొలిసారి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

Published : 27 Nov 2022 01:59 IST

విజయ్‌ హజారె క్వార్టర్స్‌లో ప్రవేశం

అహ్మదాబాద్‌: విజయ్‌ హజారె ట్రోఫీలో జమ్ము కశ్మీర్‌ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. అద్భుతమైన ఆటతీరుతో సాగుతున్న ఆ జట్టు తొలిసారి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో మొదటిసారి నాకౌట్‌ ఆడిన ఆ జట్టు.. శనివారం ప్రిక్వార్టర్స్‌లో 7 వికెట్ల తేడాతో కేరళపై గెలిచింది. మొదట కేరళ 47.4 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో వినూప్‌ మనోహరన్‌ (62) మాత్రమే రాణించాడు. మంచి ఫామ్‌లో ఉన్న పేసర్‌ అకీబ్‌ నబి (4/39) కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. అతనితో పాటు యుధ్‌వీర్‌ (2/16) కూడా మెరవడంతో క్రమం తప్పకుండా కేరళ వికెట్లు కోల్పోయింది. అనంతరం ఛేదనలో జమ్ము 3 వికెట్లు కోల్పోయి 37.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు కమ్రాన్‌ ఇక్బాల్‌ (51), శుభమ్‌ ఖజూరియా (76) అర్ధశతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి వికెట్‌కు 113 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. క్వార్టర్స్‌లో అస్సామ్‌తో జమ్ము తలపడుతుంది.

ముంబయికి యూపీ షాక్‌: దేశవాళీ క్రికెట్‌ దిగ్గజం ముంబయికి షాక్‌. విజయ్‌ హజారే ట్రోఫీలో ఆ జట్టు ప్రయాణం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. ఆ జట్టుకు షాకిస్తూ ఉత్తరప్రదేశ్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది. హార్దిక్‌ తమోరె (53), శామ్స్‌ ములాని (51) అర్ధశతకాలతో మొదట ముంబయి 48.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో శివమ్‌ మావి (4/41) విజృంభించాడు. కార్తీక్‌ త్యాగి (2/43), శివ సింగ్‌ (2/43) కూడా ఆ జట్టు పతనంలో పాలు పంచుకున్నారు. ఛేదనలో యూపీ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 45.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. ఆర్యన్‌ (82) సత్తాచాటాడు. మాధవ్‌ (46), కరణ్‌ (42 నాటౌట్‌), ప్రియమ్‌ (39 నాటౌట్‌) కూడా తలో చెయ్యి వేశారు. మరో ప్రిక్వార్టర్స్‌లో కర్ణాటక 5 వికెట్ల తేడాతో జార్ఖండ్‌పై నెగ్గింది. మొదట జార్ఖండ్‌ 47.1 ఓవర్లలో 187 పరుగులకే పరిమితమైంది. కర్ణాటక బౌలర్లలో విధ్వత్‌ (3/20), రోనిత్‌ (3/31), వెంకటేశ్‌ (3/51) రాణించారు. అనంతరం కర్ణాటక 5 వికెట్లు కోల్పోయి 40.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని