ఐవోఏ సారథిగా పీటీ ఉష!

దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక కాబోతోంది. ఈ పదవికి డిసెంబర్‌ 10న ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Published : 28 Nov 2022 01:47 IST

దిల్లీ: దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక కాబోతోంది. ఈ పదవికి డిసెంబర్‌ 10న ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. నామినేషన్లకు ఆదివారమే తుది గడువు కాగా ఉష మాత్రమే బరిలో నిలవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే. ఐవోఏ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న తొలి మహిళ ఉషానే. మహరాజా యాదవీంద్ర సింగ్‌ (1934, క్రికెట్‌) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించబోతున్న తొలి స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆమే. భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో ఎన్నో మరుపురాని విజయాలతో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న 58 ఏళ్ల ఉష.. క్రీడా పాలకురాలిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన ఈ పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌.. 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో మెరిసింది. ఒక్క ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనే 14 స్వర్ణాలతో సహా ఆమె 23 పతకాలు గెలుచుకుంది. ముఖ్యంగా 1986 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 5 స్వర్ణాలు సహా 6 పతకాలతో సంచలన ప్రదర్శన చేసింది. ఇటీవల ఐవోఏ అథ్లెటిక్స్‌ కమిషన్‌ ఎన్నిక చేసిన ఎనిమిది మంది అత్యున్నత భారత అథ్లెట్లలో ఉష కూడా ఒకటి. ఉషతో పాటు ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ (ఉపాధ్యక్షుడు), అజయ్‌ పటేల్‌ (సీనియర్‌ ఉపాధ్యక్షుడు) ఎన్నిక కావడం లాంఛనమే. ఈ పదవులకు వీళ్లు మాత్రమే దరఖాస్తు చేశారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని