Mc Cullum : అతడిని చూస్తుంటే.. ధోనిని చూసినట్టే ఉంది : కోల్‌కతా హెడ్‌ కోచ్‌ మెక్‌ కల్లమ్‌

కోల్‌కతా జట్టు వికెట్‌ కీపర్‌ షెల్డన్‌ జాక్సన్‌ ఆటతీరు చూస్తుంటే.. చెన్నై మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనిని చూసినట్లు ఉందని కోల్‌కతా హెడ్‌ కోచ్‌ మెక్ కల్లమ్‌ అన్నాడు...

Published : 05 Apr 2022 02:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : కోల్‌కతా జట్టు వికెట్‌ కీపర్‌ షెల్డన్‌ జాక్సన్‌ ఆటతీరు చూస్తుంటే.. చెన్నై మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనిని చూసినట్లు ఉందని కోల్‌కతా హెడ్‌ కోచ్‌ మెక్ కల్లమ్‌ అన్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న అతడు.. ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో సత్తా చాటాలనే దృఢసంకల్పంతో ఉన్నట్లు మెక్‌కల్లమ్‌ చెప్పాడు. 

‘షెల్డన్ జాక్సన్ రోజురోజుకి మరింత మెరుగవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 35 ఏళ్లు. అయినా మైదానంలో చాలా చురుగ్గా ఉంటాడు.షెల్డన్‌ వికెట్ కీపింగ్ నైపుణ్యాలు అద్భుతం. అతడిని వికెట్ల వెనుక చూస్తుంటే.. ధోనిని చూసినట్లే ఉంటుంది. ధోని లాగే చాలా వేగంగా స్టంపౌట్లు చేయగలడు. గింగిరాలు తిరిగే స్పిన్‌ బౌలింగ్‌ని కూడా చక్కగా అర్థం చేసుకోగలడు. దేశవాళీ క్రికెట్లో గత రెండేళ్లుగా గొప్పగా రాణిస్తున్న షెల్డన్‌కి.. బంతిని బలంగా బాదడంలో మంచి నేర్పు ఉంది. చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే అతడిలా ఆడగలరు’ అని బ్రెండన్‌ మెక్‌ కల్లమ్‌ పేర్కొన్నాడు.

ప్రస్తుత సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నైతో జరిగిన తొలి మ్యాచులో మూడు పరుగులు చేసిన షెల్డన్‌ జాక్సన్‌.. బెంగళూరుతో జరిగిన తర్వాతి మ్యాచులో డకౌటయ్యాడు. పంజాబ్‌తో జరిగిన మూడో మ్యాచులో షెల్డన్‌ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు