IND vs WI: రికార్డుల వేటలో స్టార్‌ ఆటగాళ్లు.. జట్టులోకి సంజూ శాంసన్‌

విండీస్‌పై వన్డేసిరీస్‌ ను తొలిసారి వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా ..ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది.

Updated : 29 Jul 2022 17:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విండీస్‌పై వన్డేసిరీస్‌ను తొలిసారి వైట్‌వాష్‌ చేసిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఈ రోజు ట్రినిడాడ్‌లోని బ్రియన్‌ లారా స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి..అవేంటో చుద్దాం..!

టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్ 12 పరుగులు చేస్తే, ఈ  ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో(అన్ని ఫార్మాట్లు) 1000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. 2022లో పంత్ 23 ఇన్నింగ్స్‌ల్లో 44.90 సగటుతో 988 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలతో పాటు 6 అర్ధశతకాలున్నాయి.

*  భారత యువ ఓపెనర్‌ ఇషాన్‌కిషన్‌ ఈ సిరీస్‌లో 170 పరుగులు చేస్తే, ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. కిషన్‌ 2022లో 13 మ్యాచ్‌లు ఆడి 32.23 సగటుతో 419 పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్ధశతకాలున్నాయి. చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు సబావూన్ డేవిజీ 13 మ్యాచ్‌ల్లో 589 పరుగులుతో మొదటి స్థానంలో  ఉన్నాడు. విండీస్‌ సారథి నికోలస్‌ పూరన్‌ మరో 133 పరుగులు చేస్తే ఫస్ట్‌ ప్లేస్‌లోకి వెళ్తాడు.

* శ్రేయాస్‌ అయ్యర్‌ మరో 69 పరుగులు చేస్తే, టీ20ల్లో 1000 పరుగులు సాధించిన ఎనిమిదో భారత బ్యాటర్‌ అవుతాడు.

* టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ మరో 20 రన్స్‌ కొడితే  టీ20ల్లో అత్యధిక పరుగులు ఆటగాళ్లల్లో మొదటి స్థానానికి చేరుకొంటాడు. కివీస్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గుప్తిల్ ప్రస్తుతం టాప్‌లో ఉన్నాడు. అదేవిధంగా రోహిత్‌ 13 సిక్సర్లు బాదితే టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన గుప్తిల్(169)ను అధిగమిస్తాడు.

* హర్షల్‌పటేల్‌ ఈ సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొడితే, ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన సందీప్‌ లామిచానే( నేపాల్)ను దాటుతాడు. లామిచానే 13 మ్యాచ్‌ల్లో 5.37 ఎకానమితో 26 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ 10 వికెట్లు తీస్తే సందీప్‌ను అధిగమిస్తాడు.

* ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేస్తే, టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించి పెట్టిన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలుస్తాడు. ఇప్పటికే 26 విక్టరీలతో మూడో స్థానంలో ఉండగా..30 విజయాలతో కోహ్లీ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఎంఎస్‌ ధోని 41 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

* టీమ్‌ఇండియా విండీస్‌పై 20 టీ20 మ్యాచ్‌లు ఆడగా, 13 మ్యాచ్‌ల్లో నెగ్గి, ఆరింట్లో ఓడిపోయింది. ఒక్క మ్యాచ్‌ ఫలితం తేలలేదు. విండీస్‌తో తలపడిన చివరి 5 మ్యాచ్‌లను టీమ్‌ఇండియానే గెలిచింది. దీంతో ఈ సిరీస్‌ కూడా క్లీన్‌స్వీప్‌ చేసి, రోహిత్ సేన రికార్డు సృష్టిస్తుందేమో వేచి చుడాలి.

అయితే, కొవిడ్‌ కారణంగా  భారత స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరం అయినట్లు స్పష్టత వచ్చింది. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను ఎంపికచేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని