IND vs ENG: మూడు రోజుల్లోపే ముగింపు.. ఇన్నింగ్స్‌ తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపు

భారత్‌ ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియా ఘన విజయం నమోదు చేసింది.

Updated : 09 Mar 2024 15:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్‌ఇండియా కేవలం మూడు రోజుల్లోపే ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 

ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్‌ చేసిన టీమ్‌ఇండియా.. ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో గెలిచింది. జో రూట్ (84) రాణించగా.. జానీ బెయిర్‌స్టో (39) ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 477 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 218 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను కుల్‌దీప్‌ యాదవ్‌ దక్కించుకోగా.. ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును యశస్వి జైస్వాల్ సొంతం చేసుకున్నాడు.

అదరగొట్టిన అశ్విన్

భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తన వందో టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత చెలరేగాడు. టాప్ -3 బ్యాటర్లను ఔట్‌ చేశాడు. మొత్తంగా 5 వికెట్లు తీశాడు. దీంతో వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 36వసారి. దీంతో అనిల్ కుంబ్లే (35)ను అధిగమించాడు. జస్‌ప్రీత్ బుమ్రా (2/38), కుల్‌దీప్‌ (2/40), రవీంద్ర జడేజా (1/25) రాణించారు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జాక్‌ క్రాలే 0, బెన్ డకెట్ 2, ఓలీ పోప్‌ 19, బెన్‌ స్టోక్స్ 2, బెన్ ఫోక్స్ 8, టామ్‌ హార్ట్‌లీ 20, మార్క్‌ వుడ్ 0, షోయబ్‌ బషీర్ 13 పరుగులు చేశారు.

స్పిన్నర్లదే హవా..

ధర్మశాల టెస్టు అనగానే.. పేసర్లు చెలరేగిపోతారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా బంతి టర్న్‌ కావడం విశేషం. మొత్తం 30 వికెట్లలో 26 వికెట్లు ఇరు జట్ల స్పిన్నర్లే తీశారు. భారత బౌలర్లు అశ్విన్, కుల్‌దీప్‌, రవీంద్ర జడేజా కట్టుదిట్టమైన బంతులు సంధించి ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించారు. మరీ ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ (5/72), అశ్విన్‌ (4/51) పోటాపోటీగా వికెట్ల వేట సాగించారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ (5/77) ఐదు వికెట్ల ప్రదర్శనతో తన శతక టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ యువ స్పిన్నర్ షోయబ్‌ బషీర్ (5/173) ఐదు వికెట్లు తీసినప్పటికీ.. పరుగులను నియంత్రించలేకపోవడంతో ఆ ప్రదర్శన మరుగున పడిపోయింది. 

టాప్‌ -5 బ్యాటర్లు రాణించడంతోనే..

భారత బౌలర్లు అదరగొట్టేసి ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌట్‌ చేశారు. అయితే, భారత బ్యాటర్లు తమవంతు రాణించడంతో భారీ స్కోరు చేయగలిగింది. రవీంద్ర జడేజా (15), ధ్రువ్ జురెల్ (15), అశ్విన్‌ (0) మినహా.. మిగతా బ్యాటర్లు కీలక ఇన్నింగ్స్‌లే ఆడారు. రోహిత్ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్ (110) శతకాలు చేశారు. దేవదుత్ పడిక్కల్ (65), యశస్వి జైస్వాల్ (57), సర్ఫరాజ్‌ ఖాన్ (56) హాఫ్ సెంచరీలు సాధించారు. చివర్లో కుల్‌దీప్‌ (30), బుమ్రా (20) విలువైన పరుగులు చేశారు.

స్కోరు వివరాలు: 

భారత్: తొలి ఇన్నింగ్స్‌ 477/10

ఇంగ్లాండ్‌: తొలి ఇన్నింగ్స్‌ 218/10, రెండో ఇన్నింగ్స్‌ 195/10

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని