IND vs ENG: అశ్విన్ తప్పిదం.. బ్యాటింగ్‌కు ముందే ఇంగ్లాండ్‌కు 5 పరుగులు

IND vs ENG Third Test: బ్యాటర్‌ అశ్విన్‌ తప్పిదం కారణంగా టీమ్‌ఇండియా ఐదు పరుగులను సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో ఇంగ్లాండ్‌ తన ఇన్నింగ్స్‌ను 5/0తో ప్రారంభించనుంది.

Updated : 16 Feb 2024 12:13 IST

రాజ్‌కోట్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు (IND vs ENG Third Test)లో టీమ్‌ఇండియా (Team India)కు పెనాల్టీ పడింది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాటర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) పిచ్‌ మధ్యలోని ‘రక్షిత ప్రాంతం’లో పరుగు తీశాడు. ఇది గుర్తించిన ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు రోహిత్‌ సేనకు ఐదు పరుగుల పెనాల్టీ (Penalty) విధించారు. ఫలితంగా ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే ఇంగ్లాండ్‌కు పరుగులు వచ్చాయి.

రెండో రోజు ఆట మొదలైన తర్వాత 102వ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్‌ రెహన్‌ అహ్మద్‌ వేసిన బంతిని అశ్విన్‌ ఆఫ్‌-సైడ్‌లో ఆడి సింగిల్‌ కోసం పరిగెత్తాడు. ఆ సమయంలో పిచ్‌పైన ఉన్న ‘ప్రొటెక్టెడ్‌ ఏరియా’లో రెండు మూడు అడుగులు వేసి.. వెంటనే దూరంగా వెళ్లాడు. అయితే, అంపైర్‌.. అశ్విన్‌ చర్యను గుర్తించి భారత జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు విధిస్తున్నట్లు సిగ్నల్‌ ఇచ్చాడు. దీని గురించి అశ్విని అంపైర్‌తో చర్చించినా ఫలితం లేకపోయింది. ఈ పెనాల్టీ పరుగులు ఫీల్డింగ్‌ జట్టుకు లభిస్తాయి. దీంతో ఇంగ్లాండ్‌ తన ఇన్నింగ్స్‌ను 5/0తో మొదలు పెట్టనుంది.

ఏంటీ ‘పెనాల్టీ’ రూల్స్..?

ఎంసీసీ నిబంధనల ప్రకారం.. పిచ్‌పై ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాలో పరుగులు పెట్టడాన్ని ‘అనైతిక ఆట’గా పరిగణిస్తారు. పిచ్‌కు ఉద్దేశపూరితంగా నష్టం కలిగించడం అనైతికం. స్ట్రైకర్‌ బంతిని ఆడేప్పుడు ప్రొటెక్టెడ్‌ ఏరియాలోకి వస్తే వెంటనే అక్కడి నుంచి కదలాలి. ఎలాంటి కారణం లేకుండా బ్యాటర్‌ ఆ ప్రాంతంలోకి వస్తే అంపైర్‌ దాన్ని తప్పిదంగా భావిస్తాడు. దీనిపై బ్యాటింగ్‌ జట్టుకు ఇన్నింగ్స్‌ మొత్తంలో ఒకసారి వార్నింగ్‌ ఇస్తారు. బ్యాటర్‌తో సంబంధం లేకుండా జట్టు రెండోసారి ఇదే తప్పిదం చేస్తే.. ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు.

మూడో టెస్టు తొలి రోజు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్‌ జడేజా కూడా గురువారం ఇలాగే ప్రవర్తిస్తే అంపైర్‌ హెచ్చరించారు. ఇప్పుడు అశ్విన్‌ కూడా పిచ్‌ మధ్యలో పరిగెత్తడంతో రెండో తప్పిదంగా పరిగణించి టీమ్‌ఇండియాకు జరిమానా విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు