IND vs NZ: మీకిష్టమైన బిర్యానీ దొరకలేదని.. ఇక రెస్టారంట్‌కు వెళ్లకుండా ఉంటారా..?: వాషింగ్టన్

కివీస్‌పై తొలి టీ20 మ్యాచ్‌లో (IND vs NZ) భారత్‌ (Team India) ఓటమిపాలైంది. ఛేదనలో టాప్‌ ఆర్డర్ విఫలం కావడంపై విమర్శలు రేగాయి. వెంటనే టాప్‌ ఆర్డర్‌ను మార్చాలనే వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) సరైన సమాధానం ఇచ్చాడు.

Updated : 28 Jan 2023 15:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లోనూ వాషింగ్టన్ సుందర్ రాణించినా విజయం మాత్రం టీమ్‌ఇండియా దరిచేరలేదు. అర్ధశతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ (50) బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం వాషింగ్టన్‌ సుందర్‌ మాట్లాడుతూ.. ఇదొక మ్యాచ్‌గానే పరిగణిస్తానని, ఓటమి నుంచి త్వరగా పాఠాలను నేర్చుకొంటామని చెప్పాడు. 

‘‘కెప్టెన్ హార్దిక్‌ చెప్పినట్లుగా రాంచీ పిచ్‌ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. బంతి మరీ ఎక్కువగా తిరిగేసింది. అయితే మేం ఆ సమస్యను త్వరగానే పరిష్కరించుకొంటాం. ఇదొక మ్యాచ్‌ మాత్రమే. లక్ష్య ఛేదనలో మంచి ప్రారంభం లభించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇలాంటి పిచ్‌పై ఆడటం అంత సులువేం కాదు. స్పిన్నర్లు ఎక్కువగా వికెట్లు తీశారు. ఐపీఎల్‌లోనూ, టీమ్‌ఇండియాతో ఆడినప్పుడు ఇలాంటి పిచ్‌ మీద మన ఆటగాళ్లు చాలాసార్లు ఆడారు’’ అని తెలిపాడు. 

అయితే వాషింగ్టన్ సుందర్ చెప్పిన సమాధానంపై జర్నలిస్ట్‌లు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ‘‘టాప్‌ ఆర్డర్‌’ను మార్చాల్సిన అవసరం ఉందని ఓ పాత్రికేయుడు ప్రస్తావించగా.. వాషింగ్టన్ సుందర్‌ అద్భుతంగా బదులిచ్చాడు. ‘‘నిజంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారా..? ఒక రోజు మీకిష్టమైన బిర్యానీ ఓ రెస్టారంట్‌లో దొరకలేదనుకోండి.. అప్పటి నుంచి అక్కడకు మీరు వెళ్లకుండా ఉంటారా..? ఇప్పుడు మీరు అంటున్న ఆటగాళ్లు భారీగా పరుగులు చేసినవారే. ఏదో ఒక రోజు ఇలా జరిగింది. న్యూజిలాండ్ కూడా ఇలానే రాయ్‌పుర్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో వారి టాప్‌ఆర్డర్‌ను మార్చాలని కాదు. ఆటలో ఎప్పుడు  ఏదైనా సాధ్యమే. ఓర్పుగా ఉండాల్సి ఉంటుంది. గేమ్‌లో ఒక జట్టే విజయం సాధిస్తుంది. 22 మంది ఆటగాళ్లూ ఒకేలా ప్రదర్శన ఇవ్వలేరు. ఇక అర్ష్‌దీప్‌ కూడా త్వరలోనే గాడిలో పడతాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అలాగే గతేడాదిలో భారత్‌ తరఫున వికెట్లు తీశాడు. మాలిక్‌ వంటి బౌలర్లు అరుదుగా ఉంటారు. నిలకడగా 150 కి.మీ వేగంతో బంతిని సంధించడమంటే ఆషామాషీ కాదు’’ అని వాషింగ్టన్ సుందర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని