T20 World Cup: ఐపీఎల్‌ అనుభవం.. ఒత్తిడిని జయించేలా చేస్తుంది: టీమిండియా మాజీలు 

ఐపీఎల్‌ అనుభవం టీమిండియాకు ఉపయోగపడుతుందన్న పఠాన్, కార్తిక్

Published : 23 Oct 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌ యూఏఈ వేదికగా జరగడం.. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ జట్టుకు ఎంతో ఉపయోగకరమని టీమిండియా మాజీ క్రీడాకారులు ఇర్ఫాన్‌ పఠాన్‌, దినేశ్‌ కార్తిక్ అభిప్రాయపడ్డారు. శనివారం నుంచి టీ20 ప్రపంచకప్ సూపర్‌-12 పోటీలు ప్రారంభంకానున్నాయి. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్‌తో భారత ఆటగాళ్లకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ‘క్లాస్‌ ఆఫ్‌ 2007’ స్పోర్ట్స్‌ షోలో ఇర్ఫాన్‌, కార్తిక్‌ విశ్లేషించారు. 

కార్యక్రమంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. ‘2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని జట్టు టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. మా మీద పెద్దగా అంచనాలు లేవు. కాబట్టే కసితో సమష్టిగా ఆడి కప్‌ను సాధించాం. అయితే ఇప్పుడు కోహ్లీసేన మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక్కడ సానుకూలాంశం ఏమిటంటే.. జట్టులోని ప్రతి ఆటగాడికి ఈ ఫార్మాట్‌లో అనుభవం ఉండటం శుభపరిణామం. 2007 టీ20 ప్రపంచకప్‌ సమయానికి మాకు ఈ ఫార్మాట్‌లో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని కప్‌ను గెలిచాం. ప్రస్తుతం భారత్‌ జట్టులోని ప్రతి ఆటగాడు ఐపీఎల్‌లో ఆడినవారే. కాబట్టి ఈ ఫార్మాట్‌లో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. పద్నాలుగేళ్ల కిందట సోషల్‌ మీడియా పెద్దగా లేదు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు భారీ హడావుడి సృష్టిస్తున్నాయి. క్రికెటర్ల ప్రదర్శన మీద విపరీతమైన మీమ్స్, కాంట్రవర్సీలు వచ్చేస్తాయి. కాబట్టే ఇప్పటితరం క్రీడాకారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నో అంచనాలు వారి మీద ఉన్నాయని యువ క్రికెటర్లకు తెలిసే ఉంటుంది. అలానే వాటిని హ్యాండిల్‌ చేయడమూ వచ్చని నా అభిప్రాయం’’ అని పేర్కొన్నాడు.

టీమిండియా మాజీ వికెట్ కీపర్‌ దినేశ్ కార్తిక్ కూడా దాదాపు ఇలాగే విశ్లేషించాడు. ఐపీఎల్‌ అనుభవం.. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో టీమిండియా కుర్రాళ్లకు పనికొస్తుందని చెప్పాడు. ‘‘ 2007 ప్రపంచకప్‌తో పోలిస్తే ఇప్పుడు ఆడుతున్న జట్టు సభ్యులకు ఒత్తిడిని ఎలా జయించాలో బాగా తెలుసు. దానికి ప్రధాన కారణం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్). అతిపెద్ద ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచుల్లో యువ క్రికెటర్లు ఆడారు. కాబట్టే తొలి టీ20 ప్రపంచకప్‌ (2007) పోటీల్లో పాల్గొన్న భారత జట్టుతో పోలిస్తే.. ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యం ఇప్పటి క్రికెటర్లకు అలవాటైంది’ అని వివరించాడు. 24వ తేదీన భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని