Updated : 01/12/2021 13:06 IST

IPL: 27 మంది ముద్దు

వార్నర్‌ను వదులుకున్న సన్‌రైజర్స్‌... రషీద్‌ దూరం
వేలానికి రాహుల్‌, హార్దిక్‌, శ్రేయస్‌
పూర్తయిన అట్టిపెట్టుకునే ప్రక్రియ
ముంబయి

ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియ పూర్తయింది. ఎనిమిది ఫ్రాంఛెజీల్లో ఒక్కోటి నలుగురి చొప్పున కలిపి గరిష్ఠంగా 32 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండగా.. 27 మంది క్రికెటర్లే పాత ఫ్రాంఛైజీలతో కొనసాగనున్నారు. అనుకున్నట్లే సన్‌రైజర్స్‌ డేవిడ్‌ వార్నర్‌ను వదులుకోగా.. రషీద్‌ ఖాన్‌ ఆ జట్టుకు దూరమయ్యాడు. గత సీజన్లో పంజాబ్‌ను నడిపించిన రాహుల్‌ వేలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కోల్‌కతా కెప్టెన్‌ మోర్గాన్‌ను వద్దనుకుంది. దిల్లీ  కెప్టెన్‌గా మంచి రికార్డున్న శ్రేయస్‌ అయ్యర్‌ను దిల్లీ అట్టిపెట్టుకోలేదు.

పీఎల్‌లో సూపర్‌ స్టార్‌ ఆటగాళ్లయిన మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తమ పాత జట్లయిన చెన్నై, బెంగళూరు, ముంబయిలతోనే కొనసాగబోతున్నారు. వచ్చే సీజన్‌కు రెండు కొత్త జట్లు కూడా రాబోతున్న నేపథ్యంలో మెగా వేలం జరగబోతుండగా.. ఎనిమిది పాత జట్లకు గరిష్ఠంగా నలుగురి చొప్పున అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది ఐపీఎల్‌ పాలక మండలి. ఇందుకు మంగళవారమే తుది గడువు కాగా.. చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్‌కతా గరిష్ఠ కోటాను ఉపయోగించుకుంటూ నలుగురి చొప్పున ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. బెంగళూరు, సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ తలో ముగ్గురిని ఎంచుకోగా.. పంజాబ్‌ ఇద్దరినే తమతో ఉంచుకుంది.

కళ తప్పిన సన్‌రైజర్స్‌

అనుకున్నదే అయింది. సన్‌రైజర్స్‌తో డేవిడ్‌ వార్నర్‌ బంధం తెగింది. అతణ్ని ఆ జట్టు అట్టిపెట్టుకోలేదు. ఇది ఊహించిందే అయినా.. ఐపీఎల్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌తో కొనసాగుతూ, ఆ జట్టు విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అయినా ఈ ఫ్రాంఛైజీతోనే ఉంటాడనుకుంటే.. అతనూ దూరమయ్యాడు. వార్నర్‌తో కలిసి మెరుపు ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలకంగా ఉన్న మరో ఆటగాడు బెయిర్‌స్టోను సైతం సన్‌రైజర్స్‌ వదులుకుంది. విలియమ్సన్‌ను అట్టిపెట్టుకోవడం ఊహించిందే కానీ.. సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లను జట్టుతో కొనసాగించడం ఆశ్చర్యకరమే. వీళ్లిద్దరూ అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లే (ఇంకా భారత జట్టుకు ఆడలేదు) కాబట్టి.. రూ.4 కోట్లకే ఒప్పందం చేసుకునే అవకాశం సన్‌రైజర్స్‌కు దక్కింది. అయితే వార్నర్‌, రషీద్‌, బెయిర్‌స్టోలను వదులుకోవడంతో సన్‌రైజర్స్‌ కళ తప్పుతుందనడంలో సందేహం లేదు.

రాహుల్‌, రషీద్‌లపై ఫిర్యాదు!

తమతో ఒప్పందంలో ఉండగానే వేరే ఫ్రాంఛైజీతో సంప్రదింపులు జరిపినందుకు కేఎల్‌ రాహుల్‌పై పంజాబ్‌ కింగ్స్‌, రషీద్‌ ఖాన్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఐపీఎల్‌ పాలక మండలికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఇలా చేసిన ఆటగాళ్లపై ఏడాది నిషేధం పడుతుంది. గతంలో జడేజా, మనీష్‌ పాండే ఇదే కారణంతో ఏడాది చొప్పున ఐపీఎల్‌కు దూరమయ్యారు. రాహుల్‌, రషీద్‌.. కొత్తగా ఐపీఎల్‌లో అడుగు పెడుతున్న లక్నో ఫ్రాంఛైజీతో సంప్రదింపులు జరిపారన్నది ఆరోపణ. రషీద్‌ను విలియమ్సన్‌ తర్వాత రెండో ప్రాధామ్యం ఆటగాడిగా ఎంచుకోవాలని సన్‌రైజర్స్‌ భావించగా.. అతను తొలి ప్రాధామ్యం తనకే దక్కాలని పట్టుబట్టాడట. దీంతో అతణ్ని సన్‌రైజర్స్‌ వదులుకున్నట్లు సమాచారం. రాహుల్‌ను తాము అట్టిపెట్టుకోవాలనుకున్నప్పటికీ.. అతను వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా పంజాబ్‌ మెంటార్‌ అనిల్‌ కుంబ్లే వెల్లడించాడు.


ధోని కన్నా జడేజాకు ఎక్కువ

చెన్నై జట్టు ధోనితో పాటు జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీలను అట్టిపెట్టుకుంది. అయితే ఆ జట్టు తొలి ప్రాధామ్య ఆటగాడిగా ఎంచుకుంది ధోనీని కాదు, జడేజాను. అతడికే గరిష్ఠంగా రూ.16 కోట్లు దక్కనున్నాయి. ధోని రూ.12 కోట్లే అందుకోనున్నాడు. మొయిన్‌, రుతురాజ్‌లకు వరుసగా రూ.8 కోట్లు, రూ.6 కోట్లు లభిస్తాయి. డుప్లెసిస్‌, రైనా, రాయుడు లాంటి స్టార్లను ఆ జట్టు వదులుకుంది. వరుస క్రమంలో రసెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌, నరైన్‌లను ఎంచుకున్న కోల్‌కతా.. తమ కెప్టెన్‌ మోర్గాన్‌తో పాటు మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌లకు టాటా చెప్పేసింది. రూ.15.5 కోట్లు పెట్టి కొనుకున్న కమిన్స్‌తో పాటు నిలకడగా రాణిస్తున్న ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌నూ ఆ జట్టు వదులుకుంది. దిల్లీ.. పంత్‌, అక్షర్‌ పటేల్‌, పృథ్వీ, నార్జ్‌లను తీసుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ దిల్లీ జట్టుకు దూరమయ్యాడు. శ్రేయస్‌ నాయకత్వంలోనే దిల్లీ గాడిన పడ్డప్పటికీ.. గత సీజన్‌ ప్రథమార్ధానికి గాయంతో దూరం కావడంతో పంత్‌కు తాత్కాలికంగా పగ్గాలప్పగించారు. రెండో అర్ధభాగానికి తిరిగొచ్చినప్పటికీ తిరిగి కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో నొచ్చుకున్న శ్రేయస్‌, జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధావన్‌, రబాడ, అశ్విన్‌లనూ దిల్లీ వదులుకుంది. ముంబయి జట్టు అనుకన్నుట్లే వరుస క్రమంలో రోహిత్‌, బుమ్రా, పొలార్డ్‌, సూర్యకుమార్‌లను ఎంచుకుంది. చాలా ఏళ్ల నుంచి జట్టుతో కొనసాగుతున్న హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, బౌల్ట్‌లకు మొండిచేయి తప్పలేదు. రాహుల్‌తో పాటు షమి పంజాబ్‌ జట్టుకు దూరమయ్యారు. మయాంక్‌ను రూ.14 కోట్లతో, అన్‌క్యాప్డ్‌ ఆటగాడైన అర్ష్‌దీప్‌ను రూ.4 కోట్లతో ఈ ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకుంది. ఈసారి వేలంలో పాత ఫ్రాంఛైజీలకు ‘రైట్‌ టు మ్యాచ్‌’ సౌలభ్యం ఉండదు. తమ జట్ల మాజీ ఆటగాళ్లను వేలంలో పలికిన గరిష్ఠ ధరకు తామే సొంతం చేసుకునే అవకాశం కలిపిస్తుంది ‘రైట్‌ టు మ్యాచ్‌’. కొత్తగా ఐపీఎల్‌లకు రానున్న లక్నో, అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీలు డిసెంబరు 1-25 తేదీల మధ్య అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి ముగ్గురి చొప్పున ఎంచుకుని ఒప్పందాలు చేసుకోవచ్చు.


మిగిలింది వీళ్లే

చెన్నై: జడేజా (రూ.16 కోట్లు), ధోని (రూ.12 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్‌ (రూ.6 కోట్లు)
ముంబయి: రోహిత్‌ (రూ.16 కోట్లు), బుమ్రా (రూ.12 కోట్లు), సూర్యకుమార్‌ (రూ.8 కోట్లు), పొలార్డ్‌ (రూ.6 కోట్లు)
దిల్లీ: పంత్‌ (రూ.16 కోట్లు), అక్షర్‌ పటేల్‌ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), నార్జ్‌ (రూ.6.5 కోట్లు)
కోల్‌కతా: రసెల్‌ (రూ.12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.8 కోట్లు), నరైన్‌ (రూ.6 కోట్లు)
బెంగళూరు: కోహ్లి (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (రూ.11 కోట్లు), సిరాజ్‌ (రూ.7 కోట్లు)
సన్‌రైజర్స్‌: విలియమ్సన్‌ (రూ.14 కోట్లు), అబ్దుల్‌ సమద్‌ (రూ.4 కోట్లు), ఉమ్రాన్‌ మాలిక్‌      (రూ.4 కోట్లు)
రాజస్థాన్‌: సంజు శాంసన్‌ (రూ.14 కోట్లు), బట్లర్‌ (రూ.10 కోట్లు), యశస్వి (రూ.4 కోట్లు)
పంజాబ్‌: మయాంక్‌ (రూ.12 కోట్లు), అర్ష్‌దీప్‌ (రూ.4 కోట్లు)


ఎవరి దగ్గర ఎంత ఉంది?

చెన్నై: రూ.48 కోట్లు
ముంబయి: రూ.48 కోట్లు
దిల్లీ: రూ.47.5 కోట్లు
కోల్‌కతా: రూ.48 కోట్లు
బెంగళూరు: రూ.57 కోట్లు
రాజస్థాన్‌: రూ.62 కోట్లు
సన్‌రైజర్స్‌: రూ.68 కోట్లు
పంజాబ్‌: రూ.72 కోట్లు


ఎందరిని అట్టిపెట్టుకుంటే ఎంత?

నలుగురు: 1వ ఆటగాడికి రూ.16 కోట్లు, 2వ ఆటగాడికి రూ.12 కోట్లు, 3వ ఆటగాడికి రూ.8 కోట్లు, 4వ ఆటగాడికి రూ.6 కోట్లు.
ముగ్గురు: 1వ ఆటగాడికి రూ.15 కోట్లు, 2వ ఆటగాడికి రూ.11 కోట్లు, 3వ ఆటగాడికి రూ.7 కోట్లు.
ఇద్దరు: 1వ ఆటగాడికి రూ.14 కోట్లు, రూ.10 కోట్లు.
ఒక్కరు: రూ.14 కోట్లు

అరంగేట్రం చేయని ఆటగాడికి గరిష్టంగా రూ. 4 కోట్లు

ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్యను బట్టి ఫ్రాంఛైజీల పర్స్‌ నుంచి ఈ మేరకు మినహాయిస్తారు. అయితే ఆటగాళ్లకు ఇక్కడ నిర్దేశించినట్లే చెల్లింపులు చేయాలని లేదు. తక్కువకు ఒప్పందం చేసుకున్నా నిర్దేశించిన మేరే కోత పడుతుంది. ఎక్కువ మేరకు ఒప్పందం జరిగితే ఆ మేరే కోత పడుతుంది. నలుగురిని అట్టిపెట్టుకున్న కోల్‌కతా.. తొలి ప్రాధామ్య ఆటగాడిగా రసెల్‌కు ఇవ్వబోయేది రూ.12 కోట్లే. కానీ జట్టు పర్స్‌ నుంచి రూ.16 కోట్లు కోత పడుతుంది. ఆటగాళ్ల కొనుగోలుకు ఒక్కో ఫ్రాంఛైజీకి కేటాయించిన మొత్తం రూ.90 కోట్లు. నలుగురిని అట్టిపెట్టుకున్న జట్టుకు రూ.42 కోట్లు కోత పడుతుంది. దిల్లీ నాలుగో ప్రాధామ్య ఆటగాడికి రూ. 6 కోట్లకు బదులు 6.5 కోట్లు ఇవ్వనుంది. అందుకే ఆ జట్టుకు రూ. 42.5 కోట్లు కోత పడింది.


రేటు తగ్గిన కోహ్లి

చివరగా కోహ్లికి సీజన్‌కు రూ.17 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది బెంగళూరు. ఈ సీజన్‌ నుంచి అతడికి రూ.15 కోట్ల చొప్పునే ఇవ్వనుందా ఫ్రాంఛైజీ. ఆర్‌సీబీ ముగ్గురినే అట్టిపెట్టుకుంది కాబట్టి నిబంధనల ప్రకారం తొలి ప్రాధామ్య ఆటగాడిగా కోహ్లికి రూ.15 కోట్లే ఇవ్వాలి. నలుగురిని అట్టిపెట్టుకుంటే.. అతడికి రూ.16 కోట్లు చెల్లించేవారు. కోహ్లి కాకుండా.. మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌లను వరుసగా రూ.11 కోట్లు, రూ.7 కోట్ల ధరతో ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని