Delhi Capitals: వచ్చే ఏడాది రికీ పాంటింగ్‌ స్థానంలో గంగూలీ బెటర్‌: ఇర్ఫాన్ పఠాన్‌

రెగ్యులర్ సారథి రిషభ్ పంత్‌ గైర్హాజరీలో ఈసారి దిల్లీ క్యాపిటల్స్‌ (DC) ఘోర ప్రదర్శనతో ఇబ్బంది పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిల్లీ చివరి స్థానంలో ఉంది. మిగతా రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే కనీసం ఒక అడుగైనా ముందుకు పడే అవకాశం ఉంది.

Published : 17 May 2023 19:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) దిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆడిన 12 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అడుగున కొనసాగుతోంది. ఇవాళ పంజాబ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన దిల్లీ.. పంజాబ్‌ అవకాశాలను మాత్రం ప్రభావితం చేయగలదు. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ పరుగులు సాధిస్తున్నప్పటికీ.. దూకుడుగా ఆడటంలో మాత్రం విఫలమయ్యాడు. సాల్ట్, మిచెల్ మార్ష్ కుదురుకున్నప్పటికీ ఆలస్యమైపోయింది. దీంతో కోచింగ్‌ సిబ్బందిపై విమర్శలు రేగాయి. సరైన జట్టును సన్నద్ధం చేయడంలో విఫలమైనట్లు వ్యాఖ్యలు వచ్చాయి. మెంటార్‌ సౌరభ్‌ గంగూలీ, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో కూడిన సహాయక సిబ్బంది ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం దిల్లీకి అనుకున్న విధంగా రాలేదు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్ మాత్రం రికీ స్థానంలో వచ్చే ఏడాది కోచ్‌గా గంగూలీని నియమించాలని సూచించాడు. 

భారత క్రికెటర్ల సైకాలజీ బాగా తెలిసిన గంగూలీ అయితే కోచ్ పాత్రకు సరిగ్గా సరిపోతాడని ఇర్ఫాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘దిల్లీ డగౌట్‌లో సౌరభ్‌ గంగూలీ ఉండటం పెద్ద సానుకూలాంశం. గంగూ భాయ్‌కు కోచ్‌ బాధ్యతలను అప్పగిస్తే వచ్చే ఏడాది జట్టులో సమూల మార్పులు చేస్తాడు. ఫలితాలను రాబట్టగలడు. డ్రెస్సింగ్‌ రూమ్‌ను ఎలా నడపాలో బాగా తెలుసు. గత మ్యాచ్‌ టాస్‌ సందర్భంగా డేవిడ్ వార్నర్‌ మాట్లాడుతూ తాము వచ్చే సీజన్‌ కోసం సన్నద్ధమవుతున్నట్లు చెప్పాడు. అందుకే, వచ్చే ఏడాది గంగూలీని కోచ్‌ చూడటంలో తప్పేం లేదు’’ అని ఇర్ఫాన్‌ వ్యాఖ్యానించాడు. 

మళ్లీ ప్రభ్‌ సిమ్రన్ చెలరేగుతాడు

దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్‌పై విజయం సాధించడంలో పంజాబ్‌ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్‌ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా అతడు రాణిస్తాడనే నమ్మకం ఉందని ఇర్ఫాన్‌ తెలిపాడు. ‘‘గతంలో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్‌ సిమ్రన్ ఓ సీనియర్‌ బ్యాటర్‌లా ఆడాడు. అద్భుతమైన పవర్‌తో హిట్టింగ్‌ చేశాడు. అన్ని రకాల షాట్లను ఆడేయగలడు. తప్పకుండా భవిష్యత్తులో స్టార్‌గా ఎదుగుతాడు’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని