England: ఆ జట్టుది ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’లా లేదు 

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ‘ఆటగాళ్ల ఐకమత్యం’ కోసం కట్టుబడి ఉంటామని చెప్పే ఉద్దేశంలో సరైన మద్దతు లేదని వెస్టిండీస్ దిగ్గజం మైఖేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు...

Published : 13 Jun 2021 01:11 IST

ఇంగ్లాండ్‌ టీమ్‌పై మైఖేల్‌ హోల్డింగ్‌ విమర్శలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ‘ఆటగాళ్ల ఐకమత్యం’ కోసం కట్టుబడి ఉంటామని చెప్పే ఉద్దేశంలో సరైన మద్దతు లేదని వెస్టిండీస్ దిగ్గజం మైఖేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు. అది ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు లేదని, ‘ఆల్ లైవ్స్‌ మ్యాటర్’ అని మరో అర్థం వచ్చేలా ఉందని విమర్శలు చేశారు. గతేడాది అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అనే ఉద్యమం ఊపందుకుంది.

ఈ క్రమంలోనే క్రికెట్‌లోనూ ఆటగాళ్ల మధ్య జాతి వివక్షకు తావు లేదని ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ ఆటగాళ్లు అప్పట్లో ప్రమాణం చేశారు. అప్పుడు జాతి విద్వేషం, మతపరమైన అంశాలు, లైంగిక సంబంధిత వాటికి దూరంగా ఉంటామని పేర్కొన్న జెర్సీలను ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ధరించారు. అయితే, ఇటీవల పలువురు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు విద్వేష పూరిత  ట్వీట్లు చేశారనే ఆరోపణలు రావడంతో అది మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన హోల్డింగ్‌.. ‘‘ఆటగాళ్ల ఐకమత్యం కోసం ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఇప్పుడు చేస్తున్న ప్రతిజ్ఞ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కు అనుకూలంగా లేదు. వాళ్లు చేసేది ఎలా ఉందంటే.. నేను ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అని చెప్తుంటే నువ్వు ‘ఆల్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అనేలా ఉంది’ అని విండీ దిగ్గజం పేర్కొన్నాడు.

ఈ విషయంలో ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లను మెచ్చుకోవచ్చని హోల్డింగ్‌ ప్రశంసించారు. ఇటీవల యూరో ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు, మేనేజర్‌ గారెత్‌ సౌత్‌గేట్‌ సైతం మ్యాచ్‌లు ప్రారంభమయ్యేముందు మోకాళ్లపై నిల్చొని మద్దతు తెలిపారన్నాడు. ఇందుకు కొంత మంది అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా వారు ఆటగాళ్ల ఐకమత్యానికి కట్టుబడి ఉన్నారన్నాడు. అలాగే తాను ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి కట్టుబడి ఉంటానని వెస్టిండీస్‌ మాజీ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని