naomi osaka: ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న ఒసాకా

జపాన్‌ అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి, రెండో సీడ్‌ నవోమి ఒసాకా  ఊహించని షాక్‌ ఇచ్చింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా మానసికంగా ఆందోళనకు

Updated : 02 Jun 2021 00:39 IST

పారిస్‌: జపాన్‌ అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి, రెండో సీడ్‌ నవోమి ఒసాకా  ఊహించని షాక్‌ ఇచ్చింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్లు, అందుకే తప్పుకుంటున్నట్లు  ట్వీట్‌ చేసింది. ‘‘ముందే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం టోర్నమెంట్‌కు, ఇతర క్రీడాకారులకు, నా శ్రేయస్సుకు మంచిదని భావిస్తున్నాను. 2018 యూఎస్‌ ఓపెన్‌ నుంచి నేను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాను. దాని నుంచి బయటపడేందుకు చాలా కష్టపడ్డాను. పారిస్‌ టోర్నమెంట్‌లో కూడా ఆందోళనగా ఉన్నాను. అందుకే స్వీయసంరక్షణ చర్యలు తీసుకోవడానికే మీడియా సమావేశాన్ని నిరాకరించాను. నేను సహజంగా పబ్లిక్‌ స్పీకర్‌ను కాను. ప్రపంచ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతాను.   నేనెప్పుడు పరధ్యానంగా ఉండాలని అనుకోలేదు. ప్రస్తుతం నా సమయం సరిగా లేదు. ఆటలో నిబంధనలు పాతవైపోయాయి. అందుకే ముందుగానే వైదొలుగున్నట్లు ప్రకటించాను’’ అని ఒసాకా తెలిపింది. ఇతర క్రీడాకారులు ఆటపై దృష్టి పెట్టాలని, తిరిగి పుంజుకోవాలని ఆమె సూచించారు. 

తొలిరౌండ్‌లో విజయానంతరం మీడియా సమావేశానికి హాజరుకాకపోవడంతో 23 ఏళ్ల ఒసాకాకు రిఫరీ 15,000 డాలర్ల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్యతో పాటు మరో మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నిర్వాహకులు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఆమె ఇలాగే మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలనుకుంటే తనపై కఠినమైన జరిమానాలు విధించడంతో పాటు చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని ఆ ప్రకటనలో తెలిపారు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడనని ఒసాకా చెప్పిన సంగతి తెలిసిందే.  

ఇప్పటివరకు ఒసాకా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను సొంతం చేసుకుంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని