PM Modi : అలా ఆడండి.. పతకాలొస్తాయి: కామన్వెల్త్‌ అథ్లెట్లతో ప్రధాని

కామన్వెల్త్‌ క్రీడల్లో ఆందోళన పడకుండా, అత్యుత్తమ ప్రదర్శనతో మంచి ఫలితాలు సాధించాలని భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

Updated : 21 Jul 2022 07:57 IST

దిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో ఆందోళన పడకుండా, అత్యుత్తమ ప్రదర్శనతో మంచి ఫలితాలు సాధించాలని భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఈ నెల 28న బర్మింగ్‌హామ్‌లో ఈ క్రీడలు ఆరంభమవుతున్న నేపథ్యంలో అందులో పాల్గొనే అథ్లెట్లలో కొంతమందితో ఆయన బుధవారం వర్చువల్‌గా సంభాషించారు. ‘‘గతంలో ఇలాంటి భారీ క్రీడలు ఆడిన అథ్లెట్లకు మరోసారి తమ సత్తాను పరీక్షించుకునే అవకాశం వచ్చింది. ఇక తొలిసారి ఈ క్రీడల బరిలో దిగబోతున్న అథ్లెట్లు తమ ముద్ర వేస్తారనే నమ్మకంతో ఉన్నా. ఎలాంటి ఆందోళన లేకుండా, సరదాగా ఉంటూ తలపడండి. ఇలా అథ్లెట్లందరూ చేస్తే పతకాలు అవే వస్తాయి’’ అని ఆయన తెలిపారు. సైన్యంలో చేరిన తర్వాత నాలుగేళ్లకు అథ్లెటిక్స్‌ బాట పట్టానని, అక్కడి శిక్షణతో పాటు సియాచిన్‌లోని కఠినమైన వాతావరణం తనను బలంగా మార్చిందని 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ అథ్లెట్‌ అవినాష్‌ సాబలే పేర్కొన్నాడు. మొదట్లో 74 కిలోల బరువుతో పరుగెత్తడమూ కష్టంగా ఉండేదని, ఆ తర్వాత ప్రాక్టీస్‌కు అదనపు సమయం కేటాయించి ఇప్పుడు 53 కిలోలకు చేరుకున్నానని చెప్పాడు. ‘‘ఒలింపిక్స్‌ తర్వాత ఐస్‌క్రీమ్‌ తినాలని ఉందని పీవీ సింధు నాతో చెప్పింది? ఇప్పుడు నీ ప్రణాళికలు ఏంటి’’ అని యువ షట్లర్‌ ట్రీసా జాలీని ప్రధాని అడిగారు. అందుకు ఆమె.. ‘‘క్రీడల్లో మంచి ప్రదర్శన చేయడంపై దృష్టి సారించా. విజయ సంబరాల గురించి ఆలోచించలేదు. మా ఊర్లో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌కు మంచి ఆదరణ ఉంది. కానీ అయిదేళ్ల వయసులో బ్యాడ్మింటన్‌ దిశగా నాన్న ప్రోత్సహించారు’’ అని తెలిపింది. కేరళకు చెందిన ట్రీసా.. గాయత్రి గోపీచంద్‌తో కలిసి డబుల్స్‌ బరిలో ఉంది. ఈ క్రీడల నుంచి వచ్చిన తర్వాత అథ్లెట్లందరినీ కలుస్తానని మోదీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, మీరాబాయి చాను, సవిత పునియా, సాక్షి మాలిక్‌, శివ తాప, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, భారత ఒలింపిక్‌ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు అనిల్‌ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని