WPL Final: ఫైనల్‌లో దిల్లీ చిత్తు.. డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ ఆర్సీబీదే

డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ విజేతగా ఆర్సీబీ నిలిచింది. ఫైనల్‌లో దిల్లీపై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది.  

Updated : 17 Mar 2024 23:33 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPl Final) రెండో సీజన్‌ విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత దిల్లీని 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (31), సోఫీ డివైన్‌ (32) తొలివికెట్‌కు 49 పరుగుల మంచి శుభారంభం అందించారు. అనంతరం రిచా ఘోష్‌ (17*) సహకారంతో ఎలీస్‌ పెర్రీ (35*) మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చింది. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి దిల్లీ పతనాన్ని శాసించిన సోఫీ మోలినక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది.  

తొలుత టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ జట్టుకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆ జట్టును.. కట్టుదిట్టంగా బంతులు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా ఆ జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు షెఫాలి వర్మ (44), మెగ్ లానింగ్ (23) మినహా మిగతావారు విఫలమయ్యారు. తొలి వికెట్‌కు 64 పరుగుల జోడించిన దిల్లీ ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంకా పాటిల్‌ 4, సోఫీ మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని