Ricky Ponting: కోహ్లీ.. తన సమస్యేంటో తెలుసుకోవాలి: పాంటింగ్

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తన బ్యాటింగ్‌ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని, అది త్వరలోనే చేస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...

Published : 12 Jun 2022 02:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తన బ్యాటింగ్‌ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని, అది త్వరలోనే చేస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అతడు.. తొలుత కోహ్లీ బ్యాటింగ్‌పై.. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌పై స్పందించాడు.

‘భారత టీ20 లీగ్‌ సందర్భంగా కోహ్లీ గురించి చాలా చర్చ జరిగింది. అతడు అలసిపోయాడని, పరుగులు చేయలేకపోతున్నాడని అన్నారు. కోహ్లీ బ్యాటింగ్‌ సమస్యల గురించి అతడికే వదిలేయాలి. అతడు తిరిగి గాడిలో పడేందుకు అవసరమైన మార్గాలు అన్వేషించుకోవాలి. టెక్నికల్‌గా ఇబ్బంది పడుతున్నాడా లేక మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడా అనేది తెలుసుకోవాలి. అతడు ఒక ప్రొషెషనల్‌ క్రికెటర్‌ కనుక త్వరలోనే పరిష్కారం కనుగొంటాడని నమ్ముతున్నా. అయితే, అనుభవపూర్వకంగా నాకో విషయం తెలుసు. ఒక క్రికెటర్‌గా ఎవరైనా మానసికంగా, లేదా శారీరకంగా అలసిపోలేదని తరచూ ఎవరికి వారే మోసం చేసుకుంటారు. కానీ.. వారు సాధన చేసేందుకు, క్రికెట్‌ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

ఇక ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌లో బెంగళూరు ఫినిషర్‌గా అదరగొట్టిన దినేశ్ కార్తీక్‌ గురించి మాట్లాడిన పాంటింగ్‌.. అతడిని రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బరిలోకి దించాలని సూచించాడు. డీకే ఈ ఏడాది బెంగళూరు ఫినిషర్‌గా మ్యాచ్‌లను మరోస్థాయికి తీసుకెళ్లాడని మెచ్చుకున్నాడు. సహజంగా ఇలాంటి టోర్నీలో ఏ జట్టైనా తమ అత్యుత్తమ ఆటగాళ్ల నుంచి మహా అయితే నాలుగు మ్యాచ్‌ల్లో గెలిపిస్తారని ఆశిస్తుందని, కానీ.. డీకే ఈసారి బెంగళూరు జట్టులో అంతకన్నా ఎక్కువ ప్రభావమే చూపాడని అభిప్రాయపడ్డాడు. అలాగే అతడు తిరిగి టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని