IND vs AFG: విపరీతమైన చలి.. నొప్పిని తట్టుకోలేకపోయాం: రోహిత్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో భారత్ (IND vs AFG) శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. శివమ్‌ దూబె అర్ధ శతకంతో రాణించాడు.

Updated : 12 Jan 2024 12:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - అఫ్గానిస్థాన్‌ (IND vs AFG) తొలి టీ20 మ్యాచ్‌లో ఆటగాళ్లను ‘చలి’ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మొహాలిలో ఉష్ణోగ్రత దాదాపు 9 డిగ్రీలకు పడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌ అనంతరం చలి కష్టాలను భారత కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు.

‘‘మేం అనుకున్నదానికంటే ఎక్కువగానే చలి ఉంది. చేతికి బంతి తగిలితే విపరీతమైన నొప్పి కలిగింది. ప్రస్తుతం నా పరిస్థితి ఓకే. విజయంతో మేం మ్యాచ్‌ ముగించాం. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయడం అంత ఈజీ కాదు. మా స్పిన్నర్లు చాలా అద్భుతంగా వేశారు. నేను రనౌట్‌ కావడం నిరుత్సాహానికి గురి చేసింది. ఆ సమయంలో ఆగ్రహం వచ్చినా.. జట్టు కోసం పరుగులు చేయలేనందుకు ఎక్కువ బాధ కలిగింది. ఎలాగైనా విజయం సాధించడమే ముఖ్యం. గిల్‌ ఎక్కువ సమయం బ్యాటింగ్‌ చేయాలని కోరుకున్నా. కాసేపు మంచి ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. అతడు పెవిలియన్‌కు చేరాడు. శివమ్‌ దూబె, జితేశ్‌, రింకు, తిలక్ మంచి ఫామ్‌ను కొనసాగించారు’’ అని రోహిత్‌ తెలిపాడు.

ఆరంభంలోనే కాస్త ఒత్తిడికి గురయ్యా: దూబె

‘‘ఈ మైదానంలో ఆడటాన్ని చాలా ఎంజాయ్‌ చేశా. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అసౌకర్యానికి గురి కాలేదు. ఫీల్డింగ్‌ సమయంలో ఇబ్బందులు పడ్డాం. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడి అనిపించింది. తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా. భారీ సిక్స్‌లు కొట్టగలననే నమ్మకం నాకుంది. బౌలింగ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగా’’ అని దూబె తెలిపాడు. బౌలింగ్‌లో ఒక వికెట్‌ తీసిన దూబె.. బ్యాటింగ్‌లోనూ హాఫ్ సెంచరీ (60*)తో జట్టును గెలిపించాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు  దక్కింది.

ఆరో స్థానంలో అలవాటు పడిపోయా: రింకు సింగ్

‘‘అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాక ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇక్కడ పరుగులు రాబట్టడం ఎప్పుడూ ఆస్వాదిస్తుంటా. ఈసారి తక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం వచ్చింది. గతంలో ధోనీతో చాలాసార్లు దీని గురించి చర్చించాను. బంతిని బట్టి బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవాలని మాజీ కెప్టెన్‌ సూచించాడు. ఇప్పుడు నేను ఆచరిస్తున్నదదే’’ అని రింకు సింగ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని