Viral Video: వామ్మో.. షకిబ్‌.. ఇంత కోపమా? 

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ తాజాగా మైదానంలో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. దాంతో అతడిపై ఒక మ్యాచ్‌లో నిషేధం విధించే అవకాశం ఏర్పడింది...

Published : 11 Jun 2021 22:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ తాజాగా మైదానంలో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. దాంతో అతడిపై ఒక మ్యాచ్‌లో నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా శుక్రవారం మొహమెదాన్‌, అబహాని లిమిటెడ్‌ జట్ల మధ్య ఓ టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా అబహాని టీమ్‌లో ముస్తాఫిజుర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా షకిబ్‌ బౌలింగ్‌ చేశాడు. ఒక బంతిని అతడు ఎల్బీడబ్ల్యూగా అంపైర్‌కు అప్పీల్‌ చేయడంతో దాన్ని నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో వెంటనే స్పందించిన షకిబ్‌ కోపంతో తన కాలితో వికెట్లను తన్నాడు.

ఇక మరోసారి అబహాని జట్టు ఆరో ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా ఐదో బంతి తర్వాత వర్షం కురవడంతో అంపైర్‌ మ్యాచ్‌ను నిలిపివేశారు. దానికి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షకిబ్‌ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో అంపైర్‌ను చూస్తూ వికెట్లను రెండు చేతులతో పీకేసి నేలకేసి కొట్టాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రెండుసార్లు ఆవేశంతో అంపైర్‌పై చిందులు తొక్కాడు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక వర్షం తర్వాత తిరిగి మ్యాచ్‌ ప్రారంభమయ్యాక షకిబ్‌ ఆడుతున్న జట్టు డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో సునాయాస విజయం సాధించింది.

‘నా కోపాన్ని నియంత్రించుకోలేక మ్యాచ్‌లో అలా ప్రవర్తించినందుకు మనసారా క్షమాపణలు కోరుతున్నా. ఇంట్లో ఉండి మ్యాచ్‌ను వీక్షిస్తున్న వారు కూడా నన్ను మన్నించండి. నాలాంటి అనుభవం కలిగిన ఆటగాడు అలా ప్రవర్తించి ఉండకూడదు. అయితే, కొన్నిసార్లు అలా జరిగిపోతాయి. అది మానవ తప్పిదం. ఈ సందర్భంగా నేను ఆయా క్రికెట్‌ జట్లకు, టోర్నీ నిర్వాహకులకు, మ్యాచ్‌ పర్యవేక్షకులకు క్షమాపణలు చెబుతున్నా. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి తప్పులు చేయను. ధన్యవాదాలు’ అని మ్యాచ్‌ అనంతరం ఫేస్‌బుక్‌లో షకిబ్‌ పోస్టు చేశాడు. ఇలా వికెట్లను తన్నడం లాంటి చేష్టలు క్రికెట్‌లో లెవల్‌ 3 కింద నేరంగా భావిస్తారు. ఇందుకు ఒక మ్యాచ్‌ పాటు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. మరి షకిబ్‌ విషయంలో బంగ్లా బోర్డు ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని