Parupalli Kashyap : షట్లర్‌ పారుపల్లికశ్యప్‌ఆరు వారాలపాటు ఆటకు దూరం

తెలుగు క్రీడాకారుడు, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మాజీ ఛాంపియన్‌, స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ (35) ఆరు వారాల పాటు...

Updated : 08 Jan 2022 21:40 IST

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు క్రీడాకారుడు, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మాజీ ఛాంపియన్‌, స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ (35) ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. గత నెల  ఆఖరిలో (డిసెంబర్‌ 24-30) హైదరాబాద్‌ వేదికా ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌ ఆడుతుండగా కాలి కండరాలు పట్టేయడంతో మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆటకు విరామం ప్రకటించాడు. నెలన్నర తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి ట్రైనింగ్‌ను పునఃసమీక్షిస్తానని కశ్యప్ వెల్లడించాడు. 

‘‘హైదరాబాద్ ఓపెన్‌ ఆడేటప్పుడు మొదటి మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డాను. మామూలుగా అయితే బాగానే ఉన్నా. అయితే మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌నెస్‌ మాత్రం లేదనే చెప్పాలి. ఎందుకు ఇలా జరిగిందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. వయస్సు ప్రభావం కూడా కావచ్చేమో. ట్రైనింగ్‌ సెషన్‌లో ఏమి జరిగిందో అంచనా వేయాలని భావిస్తున్నా. మ్యాచ్‌ ఆడేందుకు కాలి కండరాల స్టామినా సరిపోదు’’ అని కశ్యప్‌ పేర్కొన్నాడు. గాయం గ్రేడ్‌ -1 కిందకు వస్తుందని, ఆరు వారాలపాటు మ్యాచ్‌ ఆడలేనని చెప్పాడు. కనీసం మూడు వారాల తర్వాత శిక్షణ కోసం కోర్టులోకి వస్తానని, ఆ తర్వాత మూడు వారాల్లో మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌నెస్‌ సాధించేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించాడు. మార్చి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు కశ్యప్‌ వివరించాడు. దీంతో భారత్‌లో జరిగే మూడు పెద్ద టోర్నీల్లో కశ్యప్‌ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని