Icc World Cup 2023: ఈ కప్పులో ప్రత్యేకం

ఇంత గొప్ప ఇన్నింగ్సా! ఏంటీ అద్భుతమైన బౌలింగ్‌! క్యాచ్‌ను ఇలా కూడా పడతారా? ఇలాంటి మాటలు వింటుంటాం క్రికెట్లో!

Updated : 20 Nov 2023 08:10 IST

ఇంత గొప్ప ఇన్నింగ్సా! ఏంటీ అద్భుతమైన బౌలింగ్‌! క్యాచ్‌ను ఇలా కూడా పడతారా? ఇలాంటి మాటలు వింటుంటాం క్రికెట్లో! ప్రపంచకప్‌ (Icc World Cup 2023) లాంటి మెగా ఈవెంట్లలో ఇలాంటి మెరుపులకు కొదవుండదు. తాజా కప్‌లోనూ అలాంటి మరిచిపోలేని సందర్భాలేంటో చూద్దాం.


షమి అదుర్స్‌

ఎప్పుడొచ్చామన్నది కాదు వికెట్‌ పడిందా లేదా అన్నట్లు సాగింది ప్రపంచకప్‌లో షమి బౌలింగ్‌. ఆలస్యంగా బరిలో దిగినా.. ఈ భారత పేసర్‌ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతమైన బౌలింగ్‌ చేశాడు. కానీ న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ మాత్రం ఇంకో ఎత్తు. ఏడు వికెట్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడతను. దాదాపు 400 లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన న్యూజిలాండ్‌ కలవరపెట్టినా షమి నేనున్నా అంటూ ప్రత్యర్థిని ఆపేశాడు. ఏ భారత బౌలర్‌కూ సాధ్యం కాని రీతిలో ఏడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు.


విరాట్‌ @ 50

ఉజ్వల కెరీర్‌లో ఎన్నో ఘనతలు అందుకున్న భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఈ ప్రపంచకప్‌లో మరో కీర్తి శిఖరాన్ని అధిరోహించాడు. వన్డేల్లో 50వ సెంచరీతో మెరిసి తన ఆరాధ్య ఆటగాడు సచిన్‌ రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి 117 పరుగులు చేసే క్రమంలో సచిన్‌ (49)ను దాటేశాడు. వన్డే చరిత్రలో నిలిచిపోయే రికార్డును ఖాతాలో చేర్చుకున్నాడు విరాట్‌. అది కూడా తన హీరో సచిన్‌ సమక్షంలో ఈ ఘనత సాధించడం అతడికి జీవితాంతం గుర్తుండిపోతుంది.


మాక్సీ.. ఓ అద్భుతం

ఏ బ్యాటర్‌ అయినా అద్భుతంగా ఆడితే ఒంటిచేత్తో గెలిపించాడు అని అంటుంటారు క్రికెట్లో. కానీ మ్యాక్స్‌వెల్‌ (201 నాటౌట్‌) అసాధారణ ఆటతో ఈ మాటకు సిసలైన నిర్వచనంగా నిలిచాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఏమాత్రం ఆశలు లేని స్థితిలో.. భీకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడీ హీరో. 293 పరుగుల ఛేదనలో 91/7తో ఓటమి అంచుల్లో నిలిచినా.. చివరికి ఆసీస్‌ గెలిచిందంటే ఎవరూ నమ్మలేకపోయారు. మరి ఆ మ్యాచ్‌లో మ్యాక్సీ అంతలా మాయ చేశాడు. ఒకవైపు తొడ కండరాలు పట్టేసినా.. దాదాపు ఒకే కాలితో అతడు ఆడిన తీరు.. సిక్స్‌లు కొట్టిన విధానం నభూతో! కెప్టెన్‌ కమిన్స్‌ తోడుగా సంచలన విజయాన్ని అందించాడీ స్టార్‌. 1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్‌ 175 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తుకుతెచ్చాడు.


388 చేసినా వణికారు

లీగ్‌ దశలో ఒకసారి, నాకౌట్లో ఒకసారి కొండంత లక్ష్యాలను చేధించినంత పని చేసింది కివీస్‌. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 389 పరుగుల ఛేదనలో ఒక దశలో గెలిచేలా కనిపించింది న్యూజిలాండ్‌. కానీ ఆఖర్లో తడబడి 16 పరుగుల తేడాతో ఓడింది. భారత్‌తో సెమీస్‌లోనూ అంతే నిబ్బరంగా పోరాడింది. కీలక సమయంలో షమి అడ్డుపడకపోతే పెను సంచలనం సృష్టించేదే.


ఓ కుర్ర హీరో

అప్పటికి ఆ కుర్రాడు ఆడింది 12 వన్డేలే. కానీ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టినీ తనవైపు తిప్పేసుకున్నాడు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర. ఇంగ్లాండ్‌పై రచిన్‌ 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. టోర్నీలో రచిన్‌ పరుగుల ప్రవాహానికి తెర లేచింది అప్పుడే. పెద్దగా అనుభవం లేని 23 ఏళ్ల ఈ బ్యాటర్‌.. మిడిలార్డర్‌ నుంచి ఓపెనర్‌గా వచ్చి విజయవంతం అయ్యాడు. ఈ టోర్నీలో అతడు 3 శతకాలతో సహా 578 పరుగులు చేశాడు.


పాపం మాథ్యూస్‌

బంగ్లాదేశ్‌-శ్రీలంక మధ్య మ్యాచ్‌లో ఒక సంఘటన క్రికెట్‌ ప్రపంచంలో సంచలనం రేపింది. నిర్ణీత సమయంలో బ్యాటింగ్‌కు సిద్ధం కాలేదనే కారణంతో లంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ని అంపైర్‌ టైమ్డ్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే తాను బ్యాటింగ్‌కు సరైన సమయంలోనే వచ్చానని.. హెల్మెట్‌ స్ట్రాప్‌ ఊడిపోవడంతో వేరే హెల్మెట్‌ కోసం అడిగానని మాథ్యూస్‌ వాదించాడు. అంపైర్లు ఈ విషయాన్ని బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌కు చెప్పగా.. అతడు అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు. మాథ్యూస్‌ స్వయంగా కోరినా షకిబ్‌ ఒప్పుకోలేదు. దీంతో మాథ్యూస్‌ నిరాశగా వెనుదిరగక తప్పలేదు. టైమ్డ్‌ ఔట్‌ అయిన తొలి ఆటగాడిగా మాథ్యూస్‌ చరిత్రలో నిలిచాడు. క్రీడా స్ఫూర్తి మరిచిపోయాడని షకిబ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని