SRH vs DC : సన్‌రైజర్స్‌ విజయమా.. వార్నర్‌ ప్రతీకారమా..!

ఐపీఎల్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad), దిల్లీ క్యాపిటల్స్‌(Sunrisers Hyderabad) తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

Updated : 24 Apr 2023 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తడబడి వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరు నేడు. అవే సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad), దిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals). హైదరాబాద్‌ ఇప్పటి వరకూ ఆడిన ఆరింటిలో రెండు విజయాలు నమోదు చేయగా.. దిల్లీ ఒకే ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. అదీ అయిదు వరుస ఓటముల అనంతరం. దీంతో నేటి మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకమే. ఈ నేపథ్యంలో మరో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

మ్యాచ్‌ విన్నర్లు ఉన్నప్పటికీ..

పేపర్‌పై చూస్తే గొప్ప జట్టుగా కనిపిస్తున్నా.. ఆటలోకి వచ్చేసరికి హైదరాబాద్‌ తేలిపోతోంది. జట్టులో మ్యాచ్‌ విన్నర్లు ఉన్నప్పటికీ.. అవసరమైన సమయంలో రాణించడం లేదు. కోల్‌కతాపై సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్‌(Harry Brook).. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. నేటి మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. కెప్టెన్‌ మార్‌క్రమ్‌, రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంటుంది. ఇక డీసీపైన మయాంక్‌ అగర్వాల్‌కు మంచి రికార్డు ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో మూడు అర్ద శతకాలు నమోదు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడు భారీ ఇన్నింగ్‌ ఆడాలి. గత మ్యాచ్‌లోని బౌలింగ్‌ దళాన్నే ఈ మ్యాచ్‌లో కొనసాగించే అవకాశం ఉంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా నటరాజన్‌ను తీసుకోవచ్చు.

వార్నర్‌ మినహా..

5 వరుస ఓటముల అనంతరం ఎట్టకేలకు విజయం దక్కడంతో దిల్లీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(David Warner).. తన మాజీ జట్టు హైదరాబాద్‌పై ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంటాడో లేదో చూడాలి. మరోవైపు వార్నర్‌ మినహా.. దిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ విఫలమవతూనే ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పృథ్వీషా.. ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా రాణించింది లేదు. మిచెల్‌ మార్ష్‌ పెద్దగా ఆడింది లేదు. దిల్లీ టాప్‌ ఆర్డర్‌ రాణిస్తేనే.. ఆ జట్టు ఓటముల నుంచి బయటపడుతుంది.

హైదరాబాద్‌ జట్టు అంచనా : హ్యారీ బ్రూక్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌, మయాంక్‌ అగర్వాల్‌, క్లాసన్‌, మార్కో జన్‌సెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మార్కండే, ఉమ్రాన్‌ మాలిక్‌.

దిల్లీ జట్టు అంచనా : వార్నర్‌, ఫిల్‌ సాల్ట్‌, మిచెల్‌ మార్ష్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌/పృథ్వీ షా, మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌, అమన్‌ ఖాన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, నోకియా, ఇషాంత్‌ శర్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని