SA vs IND: మూడో టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ సమం

మూడో టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్‌ 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో ముగిసింది.  

Updated : 15 Dec 2023 01:18 IST

జొహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌(South Africa vs India)ను భారత్(Team India) 1-1 తేడాతో సమం చేసింది. తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా(South Africa) గెలుపొందింది. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టడంతో దక్షిణాఫ్రికా చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) (100; 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీర విహారం చేయండతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (60; 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరిశాడు. 202 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బర్త్ డే బాయ్‌ కుల్‌దీప్ యాదవ్ (5/17) దెబ్బకు సౌతాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో మిల్లర్‌(35) టాప్‌ స్కోరర్‌ కాగా, మార్‌క్రమ్ (25), డొనావన్‌ ఫెరీరా (12) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. జడేజా 2, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతోపాటు ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. డిసెంబరు 17 నుంచి సఫారీలతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. 

షాక్‌ల మీద షాక్‌లు 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆది నుంచే షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. సిరాజ్‌ వేసిన మొదటి ఓవర్‌ మెయిడిన్ కాగా.. ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో మాథ్యూ బ్రిజ్కె (4) ఔటయ్యాడు. బ్రిజ్కె బంతిని వికెట్ల మీదికి ఆడుకుని పెవిలియన్‌ చేరాడు. కాసేపటికే రిజా హెండ్రిక్స్‌ (8)ని సిరాజ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. హెన్రిచ్‌ క్లాసెన్ (5)ని అర్ష్‌దీప్‌ వెనక్కి పంపాడు. జడేజా తన తొలి ఓవర్‌లో మొదటి బంతికే డేంజరస్ మార్‌క్రమ్‌ని ఔట్ చేశాడు. డొనావన్ ఫెరీరాను కుల్‌దీప్‌ క్లీన్‌బౌల్డ్ చేయగా.. ఫెలుక్వాయో (0) జడేజా బౌలింగ్‌లో అతనికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. కేశవ్‌ మహరాజ్‌ (1)ని క్లీన్‌బౌల్డ్ చేసిన కుల్‌దీప్‌.. తన తర్వాతి ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను ఆలౌట్ చేశాడు. అతని బౌలింగ్‌లో నంద్రి బర్గర్ (1), విలియమ్స్ (0)ని వికెట్ల ముందు దొరికిపోగా.. మిల్లర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సౌతాఫ్రికా కోల్పోయిన చివరి ఆరు వికెట్లలో ఐదు కుల్‌దీప్‌ పడగొట్టడం విశేషం. 

దంచికొట్టిన సూర్యకుమార్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. మొదటి ఓవర్‌లో మూడు బౌండరీలు బాది జోరుమీద కనిపించిన శుభ్‌మన్‌ గిల్ (12), తిలక్ వర్మ (0)ని కేశవ్‌ మహరాజ్‌ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. గిల్‌ వికెట్ల ముందు దొరికిపోగా, తిలక్ మిడాఫ్‌లో మార్‌క్రమ్‌కు చిక్కాడు. ఈ క్రమంలో సూర్యకుమార్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. నాలుగో ఓవర్‌ వేసిన విలియ్సమ్‌ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్ చెరో సిక్స్ బాదారు. కేశవ్‌ వేసిన ఐదో ఓవర్‌లో సూర్య ఓ ఫోర్, సిక్స్ రాబట్టాడు. తర్వాత కాస్త నెమ్మదించిన స్కై మళ్లీ టాప్‌ గేర్‌లోకి వచ్చాడు. ఫెలుక్వాయో వేసిన 13వ ఓవర్‌లో వరుసగా 6,4,6,6 బాదేసి హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఈ క్రమంలో షంసి బౌలింగ్‌లో జైస్వాల్‌ పెవిలియన్‌ చేరాడు. అయినా సూర్య దూకుడు తగ్గలేదు. నంద్రి బర్గర్ బౌలింగ్‌లో వరుసగా 4,6,4 బాదిన అతడు.. విలియమ్స్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు రాబట్టి శతకానికి చేరువయ్యాడు. జైస్వాల్‌ ఔట్‌తో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ (14) ఈ సారి త్వరగానే పెవిలియన్‌ చేరగా, విలియమ్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మొదటి బంతికి సూర్య మూడంకెల స్కోరు అందుకున్నాడు. చివరి ఓవర్‌లో భారత్ మూడు వికెట్ల కోల్పోయింది. సెంచరీ చేసిన తర్వాతి బంతికే సూర్య బ్రిజ్కెకు క్యాచ్‌ ఇవ్వగా, జడేజా (4) రనౌట్‌, జితేశ్ శర్మ (4) హిట్‌ వికెట్‌గా వెనుదిరిగారు. సూర్యకుమార్ తాను ఎదుర్కొన్న చివరి 26 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం.

  • 4 - సూర్యకుమార్‌కిది టీ20ల్లో నాలుగో సెంచరీ. స్కై కంటే ముందు రోహిత్ శర్మ, మ్యాక్స్‌వెల్ ఈ ఘనత సాధించారు.
  • 3 - టీ20ల్లో పరుగుల పరంగా భారత్‌కిది మూడో అతిపెద్ద విజయం 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని