IND vs SA: టీ20 ప్రపంచకప్‌లో తొలి పరాజయం.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. బౌలర్లు కష్టపడినా ఫీల్డింగ్‌ వైఫల్యంతో భారత్‌ పరాజయం పాలైంది.

Updated : 30 Oct 2022 22:10 IST

పెర్త్: స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకు సాగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133/9 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 137 పరుగులు చేసి విజయం సాధించింది. మార్‌క్రమ్‌ (52), డేవిడ్ మిల్లర్‌ (59*) అర్ధశతకాలు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

సూర్యకుమార్‌ ఒక్కడే.. 

పెర్త్‌ పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌. అలాంటిది టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి తగ్గట్టుగానే ఓపెనర్లతోపాటు అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (12) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరాడు. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ (9) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. రోహిత్ (15) కాస్త టచ్‌లో ఉన్నట్లు కనిపించినా.. షార్ట్ పిచ్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమై ఔటయ్యాడు. తొలి మూడు వికెట్లను లుంగి ఎంగిడి (4/29) తన ఖాతాలో వేసుకొన్నాడు. ఆ తర్వాత దీపక్ హుడా (0) ఘోరంగా విఫలం కావడం.. హార్దిక్‌ పాండ్య (2), దినేశ్‌ కార్తిక్‌ (6), అశ్విన్‌ (7) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సూర్యకుమార్ యాదవ్ (68) ఒంటరి పోరాటం చేశాడు. భారత్‌ ఓ మాదిరి స్కోరు చేయడానికి ప్రధాన కారణం సూర్యానే. ఇతర బ్యాటర్లు ఇబ్బంది పడిన ఎంగిడి, నోకియా బౌలింగ్‌లోనూ అలవోకగా బౌండరీలు రాబట్టాడు. 

ఫీల్డింగ్ ఘోర వైఫల్యం

తొలి రెండు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన ఫీల్డర్లు ఈసారి మాత్రం చేతులెత్తేశారు. స్వల్ప స్కోరును కాపాడే క్రమంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్‌ చేసి చివరి ఓవర్‌ వరకు మ్యాచ్‌ను లాక్కొచ్చారు. అయితే డేవిడ్ మిల్లర్ (59*), మార్‌క్రమ్ (52) భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఇచ్చిన క్యాచ్‌ను.. అలాగే రనౌట్‌ ఛాన్స్‌ను టీమ్‌ఇండియా మిస్‌ చేసింది. మార్‌క్రమ్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అనూహ్యంగా విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు. అర్ష్‌దీప్‌ సింగ్  (2/25), షమీ (1/13), భువీ (0/21) కట్టుదిట్టంగా బంతులు వేశారు. అయితే హార్దిక్ పాండ్య (1/29) ఫర్వాలేదనిపించినా.. రవిచంద్రన్ అశ్విన్ (1/43) భారీగా పరుగులు సమర్పించాడు. డికాక్ (1), బవుమా (10), రోసోవ్ (0) వికెట్లు త్వరగా పడినా.. మిల్లర్-మార్‌క్రమ్ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించి జట్టును విజయపథంలో నడిపించారు. మార్‌క్రమ్‌ ఔటైనప్పటికీ.. మిల్లర్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. కీపింగ్‌ చేస్తున్న క్రమంలో వెన్ను నొప్పిగా అనిపించడంతో మధ్యలోనే దినేశ్‌ కార్తిక్‌ మైదానం వీడాడు. దీంతో రిషభ్‌ పంత్‌ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో కార్తిక్‌ ఆడే అవకాశాలు తక్కువేనని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు