IND vs NZ: ఈ ప్రపంచంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ ఒక్కడే.. వీరేందర్‌ శర్మ ఈ విషయాన్ని మర్చిపోయారు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని వివాదాస్పద రీతిలో అంపైర్లు ఔటివ్వడంపై అభిమానుల

Updated : 04 Dec 2021 11:47 IST

కోహ్లీ వివాదాస్పద ఔట్‌పై మాజీల స్పందన..

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని వివాదాస్పద రీతిలో అంపైర్లు ఔటివ్వడంపై అభిమానుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. కోహ్లీ నాటౌట్‌ అని చాలా స్పష్టంగా అర్థమవుతోందని పలువురు మాజీ ఆటగాళ్లతో సహా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్‌ పటేల్‌ వేసిన 30వ ఓవర్‌ చివరి బంతికి కోహ్లీ డిఫెన్స్‌ చేయబోయిన బంతిని న్యూజిలాండ్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేశారు. దీంతో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరి ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు.

అయితే, బంతి తొలుత బ్యాట్‌కు తగిలినట్లు పూర్తి నమ్మకంతో ఉన్న కోహ్లీ రివ్యూకు వెళ్లాడు. అక్కడ థర్డ్‌ అంపైర్‌ వీరేందర్‌ శర్మ పలు విధాలుగా పరిశీలించిన తర్వాత స్పష్టత లేని కారణంగా ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని పేర్కొన్నాడు. దీంతో ఔట్‌గా ప్రకటించారు. అయితే, రీప్లేలో బంతి మొదట బ్యాట్‌కు తాకి కొద్దిగా మలుపు తిరుగుతూ ప్యాడ్‌ను తాకుతున్నట్లుగా కనిపించడం గమనార్హం. ఈ క్రమంలోనే విరాట్‌ థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసహనంతో వెనుదిరిగాడు. దీనిపై స్పందించిన పలువురు మాజీ ఆటగాళ్లు, నెటిజన్లు కోహ్లీ కచ్చితంగా నాటౌట్‌ అంటూ ట్వీట్లు చేశారు. అలాగే కొందరు అంపైరింగ్‌ నిర్ణయాలపై సరదా మీమ్స్‌ రూపొందించారు. ఇక టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ ప్రగ్యాన్‌ ఓజా ఒకడుగు ముందుకేసి థర్డ్‌ అంపైర్‌ వీరేందర్‌ శర్మపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని ఔట్‌గా ప్రకటించే విషయంలో ఆయన దూకుడుగా వ్యవహరించాడనే ఉద్దేశంలో మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌తో పోలుస్తూ ట్వీట్‌ చేశాడు.

ఎవరేమన్నారంటే..

* వీరేందర్‌శర్మ ఒక విషయం మర్చిపోయారనుకుంటా.. ఈ ప్రపంచంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ ఒక్కడే ఉన్నాడు. మేం అమితంగా ఇష్టపడే ధైర్యవంతుడు అతడే.   -ప్రగ్యాన్‌ ఓజా

* కోహ్లీ కచ్చితంగా నాటౌట్‌. ఆ సెషన్‌లో న్యూజిలాండ్‌ అద్భుతంగా పుంజుకున్నా విరాట్‌ వికెట్‌తో ఆ జట్టు లాభపడింది.   -పార్థివ్‌ పటేల్‌

* నా అభిప్రాయంలో మొదట బంతి బ్యాట్‌కే తగిలింది. అలాగే నేను స్పష్టమైన ఆధారాలు లేవనే విషయాన్ని అర్థం చేసుకుంటాను. అయితే, ఇక్కడ కొంచెం బుర్రపెట్టి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. ఈ విషయంలో విరాట్‌ వికెట్‌ కోల్పోవడం బాధగా ఉంది.   - వసీమ్‌ జాఫర్‌

* తప్పుడు నిర్ణయాలు అనేవి ఆటలో ఒక భాగమే. అయితే, ఇది విరాట్‌ కోహ్లీ వికెట్‌ కాబట్టి టీమ్ఇండియాకు పెద్ద లోటే.   -ఆర్పీసింగ్‌








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని