IND vs NZ: ఇది కదా అసలైన టెస్టు క్రికెట్‌ అంటే..!

టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగీయడంపై పలువురు క్రికెటర్లు, మాజీలు స్పందించారు. ఇది అసలు సిసలైన క్రికెట్‌ మ్యాచ్‌ అని పొగిడారు...

Updated : 30 Nov 2021 14:17 IST

భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై క్రికెటర్ల స్పందన

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగీయడంపై పలువురు క్రికెటర్లు, మాజీలు స్పందించారు. ఇది అసలు సిసలైన క్రికెట్‌ మ్యాచ్‌ అని పొగిడారు. సోమవారం ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమ్‌ఇండియా విజయానికి 9 వికెట్లు అవసరం కాగా న్యూజిలాండ్‌కు 280 పరుగులు అవసరమయ్యాయి. అయితే, రోజంతా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ చివరికి 165/9తో నిలిచి ఓటమి నుంచి త్రుటిలో తప్పించుకుంది. రచిన్‌ రవీంద్ర (18; 91 బంతుల్లో 2x4), అజాజ్‌ పటేల్‌ (2; 23 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచి న్యూజిలాండ్‌కు ఓటమి తప్పించారు. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌పై క్రికెర్లు స్పందించారు.

టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ రెండు జట్లూ పలుమార్లు మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించాయి. దీంతో రెండు జట్లూ గెలుపొందడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. టెస్టుల్లో ఆఖరి రోజు 52 బంతులపాటు వికెట్‌ కాపాడుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. అందుకే టెస్టు మ్యాచ్‌ని అద్భుతమైన క్రికెట్‌గా అభివర్ణించేది.  -సచిన్‌

* టెస్టు క్రికెటే అత్యుత్తమ క్రికెట్‌. ఈ మ్యాచ్‌ను కాపాడుకునేందుకు న్యూజిలాండ్‌ అత్యద్భుత పోరాటం చేసింది. టీమ్‌ఇండియా బాగా ప్రయత్నించింది. ఇక ముంబయి టెస్టే ఫలితం తీసుకురావాలి.  -వీరేంద్ర సెహ్వాగ్‌

ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. న్యూజిలాండ్‌ను ఓడించడం ఎంత కష్టమో మరోసారి చాటిచెప్పింది. త్రుటిలో విజయాన్ని అందుకోలేకపోవడం ద్వారా టీమ్‌ఇండియా నిరాశకు గురైండొచ్చు. కానీ, స్లో పిచ్‌పై తిరిగి పుంజుకున్న తీరుకు గర్వపడాలి.  -వీవీఎస్‌ లక్ష్మణ్‌

* టెస్టు క్రికెట్‌ ఎంత బాగుంది..! ఐదు రోజులూ రెండు జట్లు ఎంతో కష్టపడి ఆడాయి. చివరికి డ్రాగా ముగిసింది. అందుకే మేం టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతాం. ముంబయిలో రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూడకుండా ఉండలేకపోతున్నా.   -డేవిడ్‌ వార్నర్‌

* ఇది అత్యంత గొప్ప ప్రదర్శన. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది న్యూజిలాండ్‌.    -జిమ్మీ నీషమ్‌

* ఇది అసలు సిసలైన టెస్టు మ్యాచ్‌. ఇలాంటి థ్రిల్లింగ్‌ ముగింపు ఇవ్వడానికి రెండు జట్లూ అత్యద్భుమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్‌లో సానుకూల అంశాలు పరిశీలిస్తే.. శ్రేయస్‌ అయ్యర్‌, అశ్విన్‌ రాణించిన తీరుకు టీమ్ఇండియా చాలా సంతోషిస్తోంది.  -దినేశ్‌ కార్తీక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని