INDvsENG: అనిల్‌ కుంబ్లే రికార్డు బద్దలు.. మూడో బౌలర్‌గా అండర్సన్‌

ఇంగ్లాండ్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమ్‌ఇండియా లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌కుంబ్లేను అధిగమించాడు...

Published : 07 Aug 2021 01:39 IST

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ కొత్త రికార్డు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమ్‌ఇండియా లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌కుంబ్లేను అధిగమించాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 800 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 708 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా దిగ్గజం కుంబ్లే ఇన్నాళ్లూ 619 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, ఆ రికార్డును అండర్సన్‌ ఇప్పుడు బద్దలుకొట్టాడు.

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గురువారం రెండోరోజు అండర్సన్‌ ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. 41వ ఓవర్‌లో చెతేశ్వర్‌ పుజారా (4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(0)ను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. దాంతో 619 వికెట్లతో గురువారం కుంబ్లే సరసన నిలిచాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మూడోరోజు ఆటలో కేఎల్‌ రాహుల్‌ (84; 214 బంతుల్లో 12x4)ను ఔట్‌ చేయడంతో అండర్సన్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పుడు అతడు కుంబ్లేను అధిగమించి మరింత ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ 563 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు అండర్సన్‌ 2003లో అరంగేట్రం చేయగా నాటి నుంచి విజయవంతమైన పేసర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు 163వ టెస్టులో కుంబ్లే రికార్డును బద్దలుకొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని