
IND vs NZ : భారత్ టెస్టు సిరీస్ విజయం.. అక్కసు వెళ్లగక్కిన కివీస్ ఆటగాడు
నెటిజన్ల ఆగ్రహానికి గురైన మెక్‌క్లాగన్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా తమ జట్టుపై టెస్టు సిరీస్ గెలుచుకోవడంపై ట్విటర్ వేదికగా స్పందించిన కివీస్ క్రికెటర్ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. నవంబర్ 25-29, డిసెంబర్ 3-7 తేదీల్లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో బతుకుజీవుడా అంటూ డ్రాతో గట్టెక్కిన కివీస్‌కు రెండో టెస్టులో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీమ్‌ఇండియా చిత్తు చేసింది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో కివీస్ బ్యాటర్ల విఫలం కావడంతో 372 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడినా.. ఆ జట్టు బౌలర్ అజాజ్ పటేల్ (10/119) జీవితాంతం గుర్తుండిపోయే రికార్డును సొంతం చేసుకున్నాడు. మాజీలు సహా ప్రస్తుత టీమ్‌ఇండియా ఆటగాళ్లు అజాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అలానే కివీస్ ఆటగాళ్లూ భారత ఆటను ప్రశంసించారు. అయితే సిరీస్ ఓటమిపై న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ మెక్‌క్లాగన్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది.
సాధారణంగా కివీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్లకు, ఆటగాళ్లకు ఎంతో మర్యాదను ఇస్తుంటారు. తమ జట్టు ఓడినా.. గెలిచినా ఇతరులను అగౌరవపరిచేలా ప్రవర్తించరు. అయితే కివీస్ ఆటగాడు మెక్‌క్లాగన్ టీమ్‌ఇండియాకు అభినందనలు చెబుతూ.. ఆ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయడమే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఇంతకీ అతడు ఏం ట్వీట్ చేశాడంటే.. ‘‘ఐసీసీ టెస్టు ఛాంపియన్ అయిన కివీస్‌ను భారత్ వారి స్వదేశంలో వారికి అనుకూలమైన పరిస్థితుల మధ్య ఓడించడంతో టీమ్‌ఇండియా ఉత్సాహంగా ఉండి ఉంటుంది.. కంగ్రాట్స్’’ అని డిసెంబర్ 7న ట్విటర్‌లో పేర్కొన్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు. అయితే మరుసటి రోజు జోక్ చేశానని కవరింగ్ ఇస్తూ మరొక ట్వీట్ చేశాడు. అయితే నెటిజన్ల ట్రోల్స్ మాత్రం ఆపలేకపోయాడు.
‘‘బ్లాక్‌క్యాప్స్ (కివీస్) అభిమానిగా నువ్వు రెచ్చగొట్టే విధంగా చేసిన ట్వీట్‌కు ఎంతో నిరుత్సాహ పడ్డా. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. బాగా ఆడిన ప్రత్యర్థి ఆటగాళ్లను అభినందించాలి.. అని సారథి కేన్ విలియమ్సన్ ఎప్పుడూ చెబుతుంటాడుగా’’ అని ఒక క్రికెట్ అభిమాని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అలానే మరొకరు ‘‘ఎవరైనా సరే తమ సొంత దేశాల్లో సింహమే. అంతేకాకుండా నువ్వు (కివీస్ క్రికెటర్‌ను ఉద్దేశించి) మరిచిపోయావేమో.. ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌ను వారి దేశంలోనే టీమ్‌ఇండియా ఓడించింది.. ఇతరులను గౌరవించడం నేర్చుకో’’ అని హితవు పలికాడు. మరి ఇలా నెటిజన్ల ట్రోల్స్‌కు గురైన మెక్‌క్లాగన్ ఇంతవరకు కివీస్ తరఫున ఒక్క టెస్టు మ్యాచూ ఆడకపోవడం గమన్హారం. న్యూజిలాండ్‌కు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచుల్లోనే ప్రాతినిధ్యం వహించాడు.
► Read latest Sports News and Telugu News