2 రోజుల్లో.. ఖేల్‌ ఖతం దుకాణ్‌ బంద్‌! 

క్రికెట్‌ అంటేనే టెస్టు క్రికెట్‌. కాలక్రమంలో వివిధ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినా అసలు సిసలు మజానిచ్చేది ఐదు రోజుల సాంప్రదాయ క్రికెటే...

Updated : 26 Feb 2021 12:45 IST

ఒకప్పుడు దడపుట్టించిన ఇంగ్లాండ్‌ ఇప్పుడిలా..

క్రికెట్‌ అంటేనే టెస్టు క్రికెట్‌. కాలక్రమంలో వివిధ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినా అసలు సిసలు మజానిచ్చేది ఐదు రోజుల సాంప్రదాయ ఆటే. ఇప్పుడంతా పరిమిత ఓవర్ల హవా నడుస్తున్నా ఒకప్పుడు ఈ సుదీర్ఘ ఫార్మాట్‌ చూసేందుకే జనాలు ఆసక్తి చూపేవారు. బ్యాట్స్‌మెన్‌ పరుగుల ప్రవాహానికి, బౌలర్ల సహనానికి ఈ మ్యాచ్‌లే ప్రత్యక్ష వేదికలుగా నిలిచేవి. ఇలాంటి రసవత్తర పోరులో ఎన్నో మ్యాచ్‌లు ఐదు రోజులపాటు పూర్తిగా జరిగేవి. కానీ, ఏకపక్షంగా సాగే మ్యాచ్‌లు నాలుగు, మూడు లేదా రెండు రోజుల్లోనే ఫలితాలు వచ్చేవి. తాజాగా భారత్‌ x ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్‌ టెస్టు కూడా ఈ జాబితాలోకే చేరింది. రెండు రోజుల్లోనే ప్యాకప్‌ చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఇప్పటివరకూ ఎన్ని టెస్టులు ఇలా రెండు రోజుల్లోనే ముగిశాయో.. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం..


ఇంగ్లాండే అత్యధికం..

అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంభమైనప్పటి నుంచీ నేటివరకు మొత్తం 2,412 టెస్టులు జరిగాయి. అందులో 22 మ్యాచ్‌లు కేవలం రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. ఇంకా వివరంగా చెప్పుకుంటే.. క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లాండ్‌ జట్టే అత్యధికంగా 13 సార్లు ఇలా రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌ల్లో భాగస్వామిగా నిలిచింది. అందులో 9 సార్లు విజయం సాధించగా, 4 సార్లు ఓటమి చవిచూసింది. ఇక ఆధునిక క్రికెట్‌లో 2000 ఏడాది తర్వాత మొత్తం ఏడు టెస్టులు ఇలా రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. అందులోనూ ఇంగ్లాండ్‌ రెండుసార్లు తలపడగా ఒకటి విజయం సాధించి, మరొకటి ఓటమిపాలైంది. మరోవైపు ఈ ఏడు టెస్టుల్లో జింబాబ్వే అత్యధికంగా మూడుసార్లు పాలుపంచుకుంది. ఆపై భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు రెండు మ్యాచ్‌లు ఆడాయి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌పై విజయాలు సాధించింది.


ఆ‌ జట్టుదే ఆధిపత్యం..

19వ శతాబ్దంలో టెస్టు క్రికెట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడేవి. దాంతో కొన్ని మ్యాచ్‌లు ఐదు రోజులు జరిగేవి, మరికొన్ని మ్యాచ్‌లు తక్కువ రోజులు జరిగేవి. ఈ క్రమంలోనే 1882లో తొలిసారి ఓ టెస్టు మ్యాచ్‌ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. అప్పుడు ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక 1888లో మరోసారి తలపడిన సందర్భంలోనూ కంగారూలనే విజయం వరించింది. అయితే, తర్వాత చెలరేగిన ఇంగ్లాండ్‌ అదే ఏడాది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఇక 1889లోనూ మరో రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. 1890లో ఆస్ట్రేలియాపై మరోసారి.. 1896లో దక్షిణాఫ్రికాపై రెండుసార్లు ఇలా రెండు రోజుల్లోనే పని పూర్తి చేసింది ఇంగ్లిష్‌ జట్టు.


ఆసీస్‌ తక్కువేం కాదు..

ఇక ఆ తర్వాత పూర్తయిన రెండు రోజుల టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయఢంకా మోగించింది. 1912లో దక్షిణాఫ్రికాపై.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ చెరో విజయం సాధించాయి. ఇక 1921, 1931, 1936, 1946లో కంగారూల జట్టు.. వరుసగా ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లపై ఆధిపత్యం చెలాయించింది. 1946 తర్వాత మళ్లీ రెండు రోజుల్లోనే ఓ టెస్టు మ్యాచ్‌ ఫలితం తేలింది 2000 సంవత్సరంలోనే. అది కూడా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. తర్వాత 2002లో పాకిస్థాన్‌పై ఆసీస్‌, 2005లో జింబాబ్వేపై.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ గెలుపొందాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ 12 ఏళ్ల తర్వాత.. 2017లో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా విజయఢంకా మోగించింది. ఇక చివరగా జరిగిన రెండు టెస్టుల్లోనూ భారత్‌ విజేతగా నిలిచింది. 2018లో అఫ్గానిస్థాన్‌పై, 2021లో ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన అద్భుత విజయాలు సాధించింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts