IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత్‌ ఇప్పటికే  ప్రాక్టీస్‌ను కూడా షురూ చేసేసింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా తొలుత శిఖర్ ధావన్‌ను ప్రకటించినా.......

Published : 17 Aug 2022 02:20 IST

ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ శిఖర్ ధావన్‌

ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత్‌ ఇప్పటికే  ప్రాక్టీస్‌ను కూడా షురూ చేసేసింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా తొలుత శిఖర్ ధావన్‌ను ప్రకటించినా.. కేఎల్‌ రాహుల్‌ రావడంతో సెలెక్షన్‌ కమిటీ అతడికి జట్టు పగ్గాలను అప్పగించింది. గాయం కారణంగా వాషింగ్టన్‌ సుందర్ వైదొలిగాడు. అతడి స్థానంలో షెహబాజ్‌ అహ్మద్‌ జట్టులోకి వచ్చాడు. ఆగస్ట్‌ 18న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో జట్టు ప్రదర్శన, సన్నద్ధత, సిరీస్‌ గురించి టీమ్ఇండియా తాత్కాలిక వైస్‌ కెప్టెన్ శిఖర్ ధావన్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.

‘‘కేఎల్ రాహుల్‌ జట్టులోకి రావడం శుభపరిణామం. మన టీమ్‌కు అతడొక కీలక ప్లేయర్. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్‌ రాబోతోంది. అందుకే రాహుల్‌ సన్నద్ధత అయ్యేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది. వాషింగ్టన్ సుందర్‌ చివరి నిమిషంలో తప్పుకోవడం కాస్త నిరాశపర్చింది. త్వరలోనే గాయం నుంచి కోలుకుంటాడని ఆశిస్తున్నా. ఇక జింబాబ్వే కూడా ఇటీవల బాగా రాణిస్తోంది. ఆ జట్టు ఆటగాళ్లు శతకాలు సాధిస్తూ ఉత్తమ ఆటతీరు ప్రదర్శిస్తున్నారు. అయితే పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో మేం ఆడతాం. నా వరకైతే అత్యుత్తమంగా రాణించి జట్టు కోసం పరుగులు చేస్తా. ఇది నాకొక మంచి అవకాశం. జింబాబ్వేలోని సికిందర్‌ రజా చాలా బాగా ఆడుతున్నాడు. తప్పకుండా జింబాబ్వే జట్టు కోసం చాలాకాలం ఆడతాడు. అయితే అతడి కోసం మా బౌలర్లు మంచి ప్రణాళికతో వస్తారని భావిస్తున్నా’’ అని వివరించాడు. 

జింబాబ్వేతో భారత్‌ మ్యాచ్‌లు ఆడటం ప్రపంచ క్రికెట్‌కు ఎంతో మంచి చేస్తుందని ధావన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘చిన్న జట్లతో పెద్ద టీమ్‌లు క్రికెట్‌ ఆడటం అన్ని విధాలా మంచిది. జింబాబ్వేతో సిరీస్‌ ఆడటం కూడా ఇరు జట్లకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది. ఉత్తమ క్రికెట్‌ ఆడేందుకు వారికి మంచి అవకాశం. ఇక టీమ్‌ఇండియాలోనూ యువ క్రికెటర్లు ఉన్నారు. అందుకే ఇలాంటి మ్యాచ్‌లు వారితోపాటు మన ఆటగాళ్లకూ ఉపయోగపడుతుంది. ఇటీవల వన్డే ఫార్మాట్‌ గురించి చాలా వార్తలు వింటున్నాం. అయితే 50ఓవర్ల ఆట అద్భుతమైంది. ఎప్పుడు దాడి చేయాలి.. ఎక్కడ డిఫెన్స్ ఆడాలనే విషయాలను బ్యాలెన్స్‌ చేయడం వన్డే ఫార్మాట్‌లోనే సాధ్యం. ఇదేమీ తీసేయదగిన గేమ్‌ కాదని నా అభిప్రాయం. ఇలాంటి క్రికెట్‌ను నేను చాలా ఆనందిస్తా’’ అని ధావన్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని