Axar Patel: విరాట్‌ కంటే ముందు అక్షర్‌ను పంపడంలో వ్యూహమిది..!

మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై విమర్శలు వచ్చాయి. అయితే.. టీమ్‌ ఇండియా (Team India)వ్యూహాన్ని పుజారా వెల్లడించాడు. 

Updated : 26 Dec 2022 12:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌తో మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ కంటే అక్షర్‌ పటేల్‌(Axar Patel)ను ముందు బ్యాటింగ్‌కు పంపడంపై అజేయ్‌ జడేజా, గావస్కర్‌ వంటి మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, టీమ్‌ ఇండియా(Team India) మేనేజ్‌మెంట్‌ వ్యవూహాత్మకంగానే అక్షర్‌ పటేల్‌(Axar Patel)ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. ఈ విషయంపై  ఓ టీవీ కార్యక్రమంలో జడేజా టీమ్‌ ఇండియా (Team India) బ్యాటర్‌ పుజారాను ప్రశ్నించాడు. దీనికి జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని పుజారా సమర్థించాడు. ‘‘అది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే బంగ్లా ప్రధాన బౌలింగ్‌ దళంలో ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు. అక్షర్‌(Axar Patel) ఎడమచేతి వాటం బ్యాటర్‌. అందుకే కుకుబుర్రా బంతిని ఎదుర్కోవడంలో అనుభవం ఉన్న అక్షర్‌(Axar Patel)ను బ్యాటింగ్‌కు పంపారు. అది మాకు చాలా కీలక నిర్ణయం. ఇన్నింగ్స్‌లో సాయంత్రం వేళ మరిన్ని వికెట్లు పోకుండా చూసుకోవాల్సిన సమయం అది. 145 పరుగుల లక్ష్య సాధనలో.. ప్రతి పరుగూ కీలకమైందే. ఈ క్రమంలో అక్షర్‌(Axar Patel) చాలా విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు’’ అని పేర్కొన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ (Axar Patel) 69 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.

అక్షర్‌(Axar Patel)ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై జడేజా మాట్లాడుతూ ‘‘ఇది కోహ్లీ(Virat Kohli)కి మంచి సంకేతాలు పంపదు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌. కోహ్లీ(Virat Kohli)నే ఈ మార్పు కోరితే అది వేరే విషయం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ, అక్షర్‌ కూడా బాగానే ఆడాడనుకోండి. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడం కష్టం’’  అని వ్యాఖ్యానించాడు.

మరోవైపు గావాస్కర్‌  కూడా టీమ్‌ ఇండియా (Team India) నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘అతడు (కోహ్లీ) ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. లేఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్‌ అని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి ఆలోచనే వస్తుంది. కానీ, నేను అనుకోవడం.. రిషబ్‌ పంత్‌ ఏమైనా నిద్రమాత్ర వేసుకొన్నాడా..? మనం ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీనే. కానీ, ఎవరికైనా బాగోలేదేమో మనకు తెలియదుగా’’ అని వెటకారంగా పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని