WTC Final: కివీస్‌ ఆటగాళ్లపై దూషణ

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఏజీస్‌ బౌల్‌ మైదానంలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లపై ఇద్దరు వ్యక్తులు అనుచిత, జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. భద్రతా సిబ్బంది వెంటనే వారిని మైదానం నుంచి గెంటేశారని తెలిసింది...

Published : 23 Jun 2021 11:22 IST

రాస్‌ టేలర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు!

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఏజీస్‌ బౌల్‌ మైదానంలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లపై ఇద్దరు వ్యక్తులు అనుచిత, జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. భద్రతా సిబ్బంది వెంటనే వారిని మైదానం నుంచి గెంటేశారని తెలిసింది. ఐదో రోజైన మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

‘న్యూజిలాండ్‌ ఆటగాళ్లను దూషించినట్టు మాకు సమాచారం అందింది. వారిని మా భద్రతా సిబ్బంది గుర్తించి మైదానం నుంచి గెంటేశారు. క్రికెట్లో దూషణ, వివక్షతో కూడిన ప్రవర్తనను మేం అస్సలు ఉపేక్షించం’ అని ఐసీసీ ప్రకటించింది. ‘ఆ ఇద్దరు వ్యక్తులు బ్లాక్‌ ఎంలో కూర్చున్నారు. రెండు జట్లు బస చేస్తున్న హోటల్‌ కిందనే ఆ సీట్లు ఉంటాయి’ అని ఈఎస్‌పీఎన్‌ ద్వారా తెలిసింది.

ఆ వ్యక్తులు దూషణ సాధారణ, జాతి వివక్షతో కూడిందని సమాచారం. సోషల్‌ మీడియా ద్వారా కొందరు అభిమానులు ఈ విషయం తెలియగానే ఐసీసీ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే చర్యలు తీసుకుంది. కివీస్‌ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌ను ఉద్దేశించే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

జాతి వివక్ష వ్యాఖ్యల సంగతి తమకు తెలియదని న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అన్నాడు. ‘లేదు, ఇప్పుడే దాని గురించి వింటున్నాను. మైదానంలో మేమెప్పుడూ సరైన క్రీడాస్ఫూర్తితోనే క్రికెట్‌ ఆడతాం. మైదానం ఆవల ఏం జరిగిందో మాకైతే తెలియదు’ అని వర్చువల్‌ మీడియా సమావేశంలో తెలిపాడు. సిడ్నీ క్రికెట్‌ మైదానంలోనూ మహ్మద్‌ సిరాజ్‌పై కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని