Yuvraj singh మేమంతా సచిన్‌ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్‌

తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు సచిన్‌ తెందూల్కర్‌ ఇచ్చిన సలహా టీమ్‌ఇండియాకు బాగా పనికొచ్చిందని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు.

Published : 30 Sep 2023 01:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar).. క్రికెట్‌లో ఎవరెస్టు శిఖరం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మైదానంలో జూనియర్‌ ఆటగాళ్లకు విలువైన సలహాలిస్తూ.. వెలుపల కూడా ఓ మార్గనిర్దేశకుడిలా ఉండేవాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ (World Cup 2011) సాధనలో ఆయన సలహా చక్కగా పని చేసిందని గుర్తు చేసుకున్నాడు మేటి ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ (Youvaraj Singh). వన్డే ప్రపంచకప్‌ 2023 సమీపిస్తున్న తరుణంలో 2011 ప్రపంచకప్‌ సమయంలో తమకు ఎదురైన అనుభవాన్ని, సచిన్‌ ఇచ్చిన సలహాను తాజాగా యువరాజ్‌ బయటపెట్టాడు. కప్‌ను సొంతం చేసుకున్న భారత్‌కు అప్పట్లో గ్రూప్‌ స్థాయిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాపై పరాజయాన్ని చవిచూసింది. దీంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని యువరాజ్  వివరించాడు.

మ్యాచ్ తర్వాత మీడియా వాళ్లు చుట్టు ముట్టడంతో ఏం చెప్పాలో అర్థంకాక, తనతో సహా ఆటగాళ్లంతా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు చెప్పాడు. ఆ సమయంలో సచిన్‌ తెందూల్కర్‌ చెప్పిన మాటలు ఇప్పటికీ మరువలేనని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్‌ వెల్లడించాడు. మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలను అసలు వినొద్దని, ఎయిర్‌పోర్టులోనూ, బస్సులో ప్రయాణిస్తూ మైదానాలకు వెళ్తున్నప్పుడు వాళ్ల మాటలు చెవిన పడకుండా హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవాలని సచిన్‌ సూచించాడట. దీంతో జట్టు సభ్యులంతా దాన్నే పాటించారట.

గ్రూప్‌ లెవెల్‌లో ఆ ఒక్క మ్యాచ్‌, ఇంగ్లాండ్‌తో ‘టై’  తప్ప.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ ఇండియా విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘‘అప్పటి పరిస్థితులు వేరు.. సోషల్‌ మీడియా లేదు. ఇప్పుడైతే ఇంకాస్త కష్టమే. అనుకోనిదేదైనా జరిగితే మీడియాతోపాటు క్రికెట్‌ అభిమానుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి అప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ గెలవాల్సిందే. మా వంతు ప్రయత్నం చేశాం. కానీ, ఓడిపోయాం. దీంతో మీడియా నుంచి విమర్శలు మొదలయ్యాయి. సచిన్‌ మా అందరితో కలిసి కూర్చొని మాట్లాడాడు. ఇకపై ఎవరూ టీవీలు చూడొద్దని, న్యూస్‌పేపర్లు చదవొద్దని, బయటకి వెళ్లినప్పుడు కచ్చితంగా హెడ్‌ఫోన్లు పెట్టుకోవాలని చెప్పాడు. మా జట్టు సభ్యులంతా అతనితో ఏకీభవించాం. కేవలం మ్యాచ్‌లు గెలవడంపైనే దృష్టి పెట్టాం. ఫలితంగా కప్పు సాధించాం’’ అని యువరాజ్‌ చెప్పుకొచ్చాడు.

ఎన్ని దేశాలు బరిలో ఉన్నా భారత్‌ మాత్రమే కప్పు గెలవాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటారని అదే పెద్ద సమస్యగా మారుతోందని యువరాజ్‌ అన్నాడు. ప్రపంచకప్‌లాంటి అతిపెద్ద టోర్నీలో చాలా బలమైన దేశాలు ఆడుతుంటాయని, వారందర్నీ వెనక్కి నెట్టి అభిమానుల ఆశల్ని నెరవేర్చేందుకు టీమ్‌ఇండియా ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని చెప్పాడు. 1983లో తొలిసారి ప్రపంచకప్‌ గెలిచిన భారత్‌.. 2011లో రెండో సారి ఆ కప్‌ను ముద్దాడింది. ఈ విజయంలో యువరాజ్‌ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఒక శతకం, 4 అర్ధశతకాలతో సహా మొత్తం 362 పరుగులు, 15 వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. ఈ టోర్నీలో నాలుగుసార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడంటే యువరాజ్‌ ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో సచిన్‌ ప్రదర్శన కూడా అద్భుతమే.. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చేసిన 18 పరుగుల ప్రదర్శన మినహా.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ తనదైన ముద్ర వేశాడు. మొత్తం 482 పరుగులు సాధించి.. టోర్నీలో రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని