జగన్‌ కంపెనీల్లో ముడుపులుగా రూ.854కోట్ల పెట్టుబడులు: సీబీఐ

జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో ముడుపులుగా రూ.854కోట్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.17వేల కోట్ల విలువైన వాన్‌పిక్‌ ప్రాజెక్టును కేటాయించిందని సీబీఐ మంగళవారం

Published : 01 Dec 2021 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో ముడుపులుగా రూ.854కోట్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.17వేల కోట్ల విలువైన వాన్‌పిక్‌ ప్రాజెక్టును కేటాయించిందని సీబీఐ మంగళవారం హైకోర్టుకు నివేదించింది. అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు ఏవీ లేకుండానే 12 వేల ఎకరాలను ప్రాజెక్టు పేరుతో పొందారని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపిస్తూ... ‘మొత్తం కేసును కలిపి చూడాలి. అందరూ కలిసి కుట్ర పన్నారు. నిందితుల పాత్రను విడివిడిగా చూడరాదు.  జగన్‌, సాయిరెడ్డిలు అన్ని కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారు. వారు జగతి పబ్లికేషన్స్‌, కార్మెల్‌ ఏసియా, రఘురాం సిమెంట్స్‌ ఇలా సంస్థలను ముడుపులు స్వీకరించడానికి ఏర్పాటు చేశారు...’ అని సీబీఐ వివరించింది. ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించే వ్యక్తులు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే.. ఆయన తండ్రి వై.ఎస్‌. ఆ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రాజెక్టులు అప్పగిస్తారని పేర్కొంది. అంతకుముందు వాన్‌పిక్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ... ‘జగన్‌, వైఎస్‌తో కలిపి పిటిషనర్లు కుట్ర పన్నారనడానికి ఒక్క ఆధారాన్ని సమర్పించలేదు. ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలన్నీ రస్‌ ఆల్‌ ఖైమా (రాక్‌)కేనని, ఏజంటుగా తాము వ్యవహరించినట్లు’’ చెప్పారు. జగన్‌ కంపెనీల్లో రూ.497 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టామన్నారు. ఈ వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.

హెటిరో, డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డిల పిటిషన్‌ల కొట్టివేత

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హెటిరో కంపెనీతోపాటు డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణను నిలిపివేస్తూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులనూ ఎత్తివేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో విచారణ ప్రక్రియ చేపట్టడానికి ఐపీసీ సెక్షన్‌ 120 బి రెడ్‌విత్‌ 420కి సంబంధించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని