T20 League: బంతి నవ్వింది.. బెంగళూరు గెలిచింది

129 పరుగుల లక్ష్యం.. డుప్లెసిస్‌, కోహ్లి, దినేశ్‌ కార్తీక్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ ఉన్న బెంగళూరు ఆడుతూ పాడుతూ ఛేదించేయాలి. కానీ వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, శ్రేయస్‌, రసెల్‌ లాంటి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కోల్‌కతా 128 పరుగులే చేసినపుడు

Updated : 31 Mar 2022 06:48 IST

128 పరుగులకే కోల్‌కతా ఆలౌట్‌
చాలా కష్టపడి ఛేదించిన బెంగళూరు  
విజృంభించిన హసరంగ, హర్షల్‌, ఆకాశ్‌

129 పరుగుల లక్ష్యం.. డుప్లెసిస్‌, కోహ్లి, దినేశ్‌ కార్తీక్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ ఉన్న బెంగళూరు ఆడుతూ పాడుతూ ఛేదించేయాలి. కానీ వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, శ్రేయస్‌, రసెల్‌ లాంటి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కోల్‌కతా 128 పరుగులే చేసినపుడు బెంగళూరుకు మాత్రం ఛేదన అంత తేలిక ఎలా అవుతుంది? 7 వికెట్లు కోల్పోయి.. 20వ ఓవర్లో కానీ బెంగళూరు విజయాన్నందుకోలేకపోయింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై మొదట కోల్‌కతా పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్పిన్నర్‌ హసరంగతో పాటు బెంగళూరు పేసర్లూ విజృంభించడంతో ఒక దశలో 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు అతి కష్టం మీద 128 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో బెంగళూరు కూడా తడబడ్డా లక్ష్యం చిన్నదే కావడంతో గట్టెక్కింది.

ముంబయి: ఎక్కువగా పరుగుల పంట పండే టీ20 క్రికెట్‌ లీగ్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో బౌలర్లు వికెట్ల పంట పండించుకున్నారు. గత మ్యాచ్‌లో రెండు జట్లూ 200 పైచిలుకు స్కోర్లు చేసిన డీవై పాటిల్‌ స్టేడియంలో మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. బెంగళూరు బౌలర్ల ధాటికి కేవలం 128 పరుగులకే ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హసరంగ (4/20), హర్షల్‌ పటేల్‌ (2/11), ఆకాశ్‌ దీప్‌ (3/45) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. రసెల్‌ (25; 18 బంతుల్లో 1×4, 3×6) టాప్‌స్కోరర్‌. అనంతరం టిమ్‌ సౌథీ (3/20), ఉమేశ్‌ యాదవ్‌ (2/16), నరైన్‌ (1/12)ల కట్టుదిట్టమైన  బౌలింగ్‌తో బెంగళూరు కూడా తడబడ్డప్పటికీ.. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (28; 40 బంతుల్లో 1×4, 1×6), షాబాజ్‌ అహ్మద్‌ (27; 20 బంతుల్లో 3×6) పోరాడడంతో గట్టెక్కింది. లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించిన బెంగళూరు సీజన్లో బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌ల్లో పంజాబ్‌ చేతిలో బెంగళూరు కంగుతినగా.. చెన్నైపై కోల్‌కతా నెగ్గిన సంగతి తెలిసిందే.

కష్టమే అనిపించినా..: గత మ్యాచ్‌లో 205 పరుగులు చేసిన బెంగళూరుకు.. 129 పరుగులు ఒక లెక్కా అనుకుంటే.. ఆ జట్టుకు ఒక దశలో ఇదే కొండంత లక్ష్యంగా మారింది. ఉమేశ్‌ యాదవ్‌, సౌథీ కలిసి మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి ఆ జట్టును గట్టి దెబ్బే తీశారు. అనుజ్‌ రావత్‌ (0), డుప్లెసిస్‌ (5), కోహ్లి (12)ల వికెట్లు కోల్పోయి 17/3తో నిలిచిన బెంగళూరుకు కష్టమే అనిపించింది. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందుకొచ్చిన డేవిడ్‌ విల్లీ (18)తో కలిసి విండీస్‌ కుర్రాడు రూథర్‌ఫోర్డ్‌ పోరాడాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఈ జోడీ పరుగుల గురించి ఆలోచించకుండా.. ఆచితూచి బ్యాటింగ్‌ చేసింది. క్రీజులో కుదురుకున్నాక షాట్లు ఆడింది. విల్లీని నరైన్‌ ఔట్‌ చేసేసరికి 11 ఓవర్లలో బెంగళూరు స్కోరు 62/4. ఈ దశలో రూథర్‌ఫోర్డ్‌కు జతకలిసిన షాబాజ్‌ అహ్మద్‌.. కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మూడు సిక్సర్లతో సమీకరణాన్ని తేలిగ్గా మార్చాడు. ఇక బెంగళూరు తేలిగ్గా గెలిచేస్తుందనుకుంటే.. షాబాజ్‌ను వరుణ్‌ చక్రవర్తి వెనక్కి పంపడం.. సౌథీ 18వ ఓవర్లో రూథర్‌ఫోర్డ్‌, హసరంగ (4)లను ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. బెంగళూరు 2 ఓవర్లలో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ స్పెషలిస్టు బౌలర్లందరి కోటా అయిపోవడంతో వెంకటేశ్‌ అయ్యర్‌ బౌలింగ్‌కు వచ్చాడు. హర్షల్‌ (10 నాటౌట్‌) అతడి బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టడంతో మ్యాచ్‌ బెంగళూరు వైపు మొగ్గింది. రసెల్‌ వేసిన చివరి ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ (14 నాటౌట్‌) వరుసగా 6, 4 కొట్టి ఉత్కంఠకు తెరదించాడు.

టపటపా..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా పరుగుల కోసం నానా తంటాలు పడింది. ఆ జట్టులో ఒక్కరూ కనీసం 20 బంతులు ఆడలేదు. 20 పరుగులు దాటింది ఒక్క రసెల్‌ మాత్రమే. ప్రతి బ్యాట్స్‌మన్‌ ఇలా రావడం, అలా వెళ్లడం.. ఇదీ వరస. పేస్‌, స్పిన్‌కు సమానంగా సహకరిస్తున్న పిచ్‌పై బెంగళూరు బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్‌ హసరంగ.. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. అతను మధ్య ఓవర్లలో కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ (13), ప్రమాదకర నరైన్‌ (12)లను ఔట్‌ చేసి ప్రత్యర్థిని గట్టి దెబ్బ తీశాడు. హసరంగ మొత్తంగా 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతా కోలుకునే అవకాశమే లేకుండా చేశాడు. హసరంగ రంగ ప్రవేశానికి ముందు ప్రత్యర్థిని ఆరంభంలో దెబ్బ కొట్టింది ఆకాశ్‌ దీప్‌. తన తొలి ఓవర్లోనే వెంకటేశ్‌ అయ్యర్‌ (10)ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చిన అతను.. ఆ తర్వాత నితీశ్‌ రాణాను ఔట్‌ చేశాడు. ఒక దశలో 67/6తో నిలిచిన కోల్‌కతా.. వంద చేయడమూ కష్టంగానే కనిపించింది. అయితే బిల్లింగ్స్‌ (14), రసెల్‌ కాసేపు నిలబడటం.. చివర్లో ఉమేశ్‌ (18), వరుణ్‌ చక్రవర్తి (10 నాటౌట్‌) పోరాడటంతో ఆ జట్టు కాస్త గౌరవప్రదమైన స్కోరు చేసింది. 14వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన హర్షల్‌ పటేల్‌.. నాలుగు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి, 2 వికెట్లు తీశాడు. అతను రెండు మెయిడెన్లు వేయడం విశేషం.


నేటి మ్యాచ్‌: లఖ్‌నవూ × చెన్నై
వేదిక: ముంబయి, రా।। 7.30

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని