Phone Link App: ఫోన్‌ లింక్‌ యాప్‌తోనే ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్‌

మైక్రోసాఫ్ట్‌ ఫోన్‌ లింక్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై దీని సాయంతో విండోస్‌ డెస్క్‌టాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ పరికరాల్లోని ఇమేజ్‌ల నుంచి నేరుగా టెక్స్ట్‌ సంగ్రహించుకోవచ్చు.

Updated : 12 Jun 2024 01:05 IST

మైక్రోసాఫ్ట్‌ ఫోన్‌ లింక్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై దీని సాయంతో విండోస్‌ డెస్క్‌టాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ పరికరాల్లోని ఇమేజ్‌ల నుంచి నేరుగా టెక్స్ట్‌ సంగ్రహించుకోవచ్చు. పీసీ, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మధ్య వారధిగా ఫోన్‌ లింక్‌ యాప్‌ పనిచేస్తుందన్నది తెలిసిందే. డెస్క్‌టాప్‌ నుంచే కాల్స్‌ చేయటం, నోటిఫికేషన్లు చూడటం, మెసేజ్‌లకు స్పందించటం, ఫోన్‌లోని ఇమేజ్‌లను షేర్‌ చేయటం వంటి ఎన్నో పనులను ఇది సుసాధ్యం చేస్తోంది. ఈ యాప్‌ను మరింత ఆకర్షణీయంగా మలచటానికి ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్‌ సంగ్రహించే ఫీచర్‌ను తాజాగా పరిచయం చేశారు. ఇది ఇమేజ్‌లో ఎలాంటి టెక్స్ట్‌ ఉన్నా దాన్ని గుర్తించి, క్లిప్‌బోర్డులో కాపీ చేస్తుంది. అప్పుడు టెక్స్ట్‌ను తేలికగా షేర్‌ చేసుకోవచ్చు, సేవ్‌ చేసుకోవచ్చు. అయితే గజిబిజి బ్యాక్‌గ్రౌండ్‌ వంటి కొన్ని చిత్రాల నుంచి ఇది టెక్స్ట్‌ను సరిగా గుర్తించలేకపోవచ్చు. స్పష్టంగా కనిపించే అక్షరాలను మాత్రం బాగా సంగ్రహిస్తుంది. మరి ఈ ఫీచర్‌ను ఎలా వాడుకోవాలి?

  • ముందుగా ఫోన్‌ లింక్‌ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ ఫోన్, విండోస్‌ పరికరం రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. అనంతరం డెస్క్‌టాప్‌ మీద ఫోన్‌ లింక్‌ యాప్‌ ద్వారా ఫోన్‌లోని ఫొటోస్‌ను చేరుకోవాలి.
  • ఫోన్‌ లింక్‌ యాప్‌లో కాల్స్, మెసేజెస్‌ పక్కన ఉండే ఫొటోస్‌ విభాగంలోకి వెళ్లాలి.
  • కనిపించే టెక్స్ట్‌తో కూడిన ఫొటోను యాప్‌లో ఎంచుకోవాలి.
  • పై కనిపించే టెక్స్ట్‌ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • టెక్స్ట్‌ను యాప్‌ గుర్తిస్తే మౌస్‌తో దాన్ని హైలైట్‌ చేయాలి. లేదా సెలెక్ట్‌ ఆల్‌ టెక్స్ట్, కాపీ టెక్స్ట్‌ ఆప్షన్లనైనా వాడుకోవచ్చు.
  • కాపీ చేసుకున్న టెక్స్ట్‌ను వర్డ్‌ ప్యాడ్‌లోనో, నోట్‌ ప్యాడ్‌లోనో పేస్ట్‌ చేసుకుంటే సరి. నేరుగా మెసేజింగ్‌ యాప్‌లలోనైనా పేస్ట్‌ చేసుకోవచ్చు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని