Password: ఇకనైనా మానండి @123, 123456

సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతుండటం, వ్యక్తిగత గోప్యతపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, యూజర్లు తమ ఆన్‌లైన్‌ ఖాతాల పాస్‌వర్డ్‌ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated : 16 Nov 2022 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ వేదికగా జరిగే సైబర్‌ నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వాలు, టెక్‌ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.  ఖాతాల లాగిన్‌ వివరాలు, వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు యూజర్లు తమ ఖాతాలకు స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్ (Password) పెట్టుకోవాలని సూచిస్తున్నాయి. కానీ, ఎక్కువ మంది యూజర్లు ఈ సూచనలను లెక్కచేయడంలేదు. ఇప్పటికీ, చాలా మంది యూజర్లు తమ ఆన్‌లైన్‌ ఖాతాలకు సులువైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు ఆన్‌లైన్ పాస్‌వర్డ్ మేనేజర్‌ నార్డ్‌పాస్‌ (NordPass) తెలిపింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌లలో Password@123, Password123, Password@1 తొలి మూడు స్థానాల్లో ఉండగా, bigbasket నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. తర్వాతి స్థానాల్లో వరుసగా 123456, 12345678, 123456789, pass@123, abcd1234, googledummy ఉన్నాయి. 

ఆన్‌లైన్‌ సమాచారం, వ్యక్తిగత గోప్యత గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో యూజర్లు ఇలాంటి పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోందని నార్డ్‌పాస్‌ పేర్కొంది. 2022లో Password అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఉపయోగిస్తే, భారత దేశంలోనే మూడున్నర లక్షల మంది తమ ఖాతాలకు పాస్‌వర్డ్‌గా ఉందని తెలిపింది. భారత్‌ సహా 30 దేశాల్లో చోటుచేసుకున్న సైబర్‌ సెక్యూరిటీ ఘటనల ఆధారంగా  నార్డ్‌పాస్‌ సర్వే నిర్వహించింది. ఈ ఫలితాలను తాజాగా వెల్లడించింది. టెక్‌ సంస్థలు, ప్రభుత్వాలు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తునప్పటికీ, యూజర్లలో మార్పురాకపోవడంపై సైబర్‌ సెక్యూరిటీ నిపుణలు  ఆందోళన వ్యక్తం చేశారు. 

యూజర్లు తమ పాస్‌వర్డ్‌లలో తప్పనిసరిగా స్మాల్‌, క్యాపిటల్ లెటర్స్‌తోపాటు నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకోవాలని, కచ్చితంగా టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయాలని సూచించారు. వీటితోపాటు ప్రతి మూడు నెలలకోసారి పాస్‌వర్డ్ మార్చుకోవడంతోపాటు, ఒకసారి ఉపయోగించిన పాస్‌వర్డ్‌ను తిరిగి ఉపయోగించవద్దని కోరారు. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల హ్యాకింగ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని