Artificial Intillegence: ఫోన్‌ టైపింగ్‌ వేగంగా

కీబోర్డుల్లో మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌కీ ప్రత్యేకతే వేరు. ఉచితంగా లభించే దీన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ పరికరాలు రెండింటిలోనూ వాడుకోవచ్చు. వేగంగా టైప్‌ చేయటానికి తోడ్పడే కృత్రిమ మేధ (ఏఐ) సపోర్టుతో కూడిన ఇందులో ఫీచర్లూ చాలానే ఉన్నాయి.

Published : 05 Jun 2024 00:11 IST

కీబోర్డుల్లో మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌కీ ప్రత్యేకతే వేరు. ఉచితంగా లభించే దీన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ పరికరాలు రెండింటిలోనూ వాడుకోవచ్చు. వేగంగా టైప్‌ చేయటానికి తోడ్పడే కృత్రిమ మేధ (ఏఐ) సపోర్టుతో కూడిన ఇందులో ఫీచర్లూ చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని సదుపాయాల గురించి తెలుసుకుందాం.

ఇష్టమైన స్టికర్‌ సృష్టి

తరచూ స్టికర్లు వాడుతూనే ఉంటాం. ఇప్పటికే ఫోన్‌లో బోలెడన్ని స్టికర్ల కలెక్షన్‌ ఉండి ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు కొత్తవి కావాలని అనిపించొచ్చు. ఇందుకు స్విఫ్ట్‌కీ బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఇష్టమైన స్టికర్లను సృష్టించుకోవటం చాలా తేలిక. డాల్‌-ఈ 3 పరిజ్ఞానంతో పనిచేసే దీన్ని వాడుకోవాలంటే.. ముందుగా ఫోన్‌లో స్విఫ్ట్‌కీని ఓపెన్‌ చేయాలి. పైన ఎడమ వైపున కనిపించే బాణం గుర్తు మీద తాకితే టూల్‌బార్‌ ప్రత్యక్ష మవుతుంది. ఇప్పుడు కీబోర్డుకు పైన కుడిమూలన ఉండే మూడు చుక్కల మీద నొక్కి, స్టికర్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు అడుగున మంత్రదండంలాంటి బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే టెక్స్ట్‌ బాక్సు కనిపిస్తుంది. ఇందులో ఎలాంటి స్టికర్‌ అవసరమో వర్ణించాలి. అంతే తగిన స్టికర్‌ పుట్టుకొస్తుంది. 

భాషల మధ్య మారటం

జీబోర్డు మాదిరిగానే స్విఫ్ట్‌కీలోనూ తేలికగా టైప్‌ చేసే భాషలకు మారొచ్చు. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌లో 700కు పైగా భాషలను సపోర్టు చేస్తుంది. స్పేస్‌బార్‌ మీద కుడి, ఎడమలకు స్వైప్‌ చేయటం ద్వారా ఆయా భాషలకు ఇట్టే మారొచ్చు. స్విఫ్ట్‌కీ యాప్‌లో లాంగ్వేజ్‌ విభాగంలోకి వెళ్లి భాషలను వెతకొచ్చు. అవసరమనుకుంటే వాటిని జత చేసుకోవచ్చు. 

ఫోన్‌ నుంచి పీసీకి కాపీ, పేస్ట్‌

స్విఫ్ట్‌కీలో బిల్టిన్‌గా క్లిప్‌బోర్డు ఫీచరూ ఉంటుంది. దీంతో ఫోన్‌ నుంచి పీసీకి.. అలాగే పీసీ నుంచి ఫోన్‌కు టెక్స్ట్, లింక్‌లు కాపీ, పేస్ట్‌ చేసుకోవచ్చు. ఒకసారి దీన్న సెట్‌ చేసుకుంటే వాడుకోవటం తేలికే. పైన ఎడమ వైపున బాణం గుర్తును నొక్కి టూల్‌బార్‌ ద్వారా వెళ్లి, క్లిప్‌బోర్డు బటన్‌ మీద తాకాలి. అక్కడి నుంచి ఎనేబుల్‌ చేసుకోవాలి. కానీ పీసీతో దీన్ని సింక్‌ చేసుకోవాలంటే యాప్‌ సూచించే మార్గాలను అనుసరించాలి. 

కీబోర్డు నుంచే కోపైలట్‌

ఏఐ ఆధారిత కోపైలట్‌ ఛాట్‌బాట్‌ స్విఫ్ట్‌కీలోనూ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ మీద ఎలాంటి పనిచేస్తున్నా కూడా సెర్చ్, ఛాట్, కొత్త మెసేజ్‌ కంపోజ్‌ వంటి ఎన్నో పనులను దీంతో చేయించుకోవచ్చు. కావాలంటే మన తరపున విషయాలను రాసి పెడుతుంది కూడా. స్విఫ్ట్‌కీని ఉపయోగిస్తున్నప్పుడు అన్నింటికన్నా ఎడమవైపున ఉండే బటన్‌ను నొక్కి, టూల్‌బార్‌ ద్వారా కోపైలట్‌ను చూడొచ్చు.

ఇన్‌కాగ్నిటో మోడ్‌

మనం సెర్చ్‌ చేసే అంశాలపై కీబోర్డు నిఘా వేయొద్దని భావిస్తే స్విఫ్ట్‌కీ ఇన్‌కాగ్నిటో మోడ్‌ను వాడుకోవచ్చు. ఇది డిఫాల్ట్‌గా డిసేబుల్‌ అయ్యింటుంది. కానీ టూల్‌బార్‌ ద్వారా తేలికగా ఎనేబుల్‌ చేసుకోవచ్చు. మూడు చుక్కల మెనూ గుర్తు మీద తాకి ఇన్‌కాగ్నిటో బటన్‌ను ఆన్‌ చేసుకుంటే చాలు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని