పీసీ జోష్‌

డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ వంటి పీసీలతో గొప్ప ప్రయోజనం బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉండటం. గేమింగ్, గ్రాఫిక్‌ డిజైన్, వీడియో ఎడిటింగ్, వ్యాపార అవసరాలు.. ఇలా ఎలాంటి పనులకైనా సాయం చేయటానికి సిద్ధంగా ఉంటాయి.

Published : 12 Jun 2024 00:56 IST

డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ వంటి పీసీలతో గొప్ప ప్రయోజనం బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉండటం. గేమింగ్, గ్రాఫిక్‌ డిజైన్, వీడియో ఎడిటింగ్, వ్యాపార అవసరాలు.. ఇలా ఎలాంటి పనులకైనా సాయం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ప్రీమియం సాఫ్ట్‌వేర్లకు చాలా ఖర్చు పెట్టాలి. అందరికీ వీటిని కొనుక్కోవటం సాధ్యం కాకపోవచ్చు. మరెలా? చాలా యాప్‌లకు ఉచిత ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. ప్రీమియం సాఫ్ట్‌వేర్లంత కాకపోయినా ఇవీ బాగానే పనిచేస్తాయి. మామూలు అవసరాలకివి సరిపోతా యనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కొన్ని ఉచిత అప్లికేషన్ల గురించి తెలుసుకుందాం.


ఓబ్సిడియన్‌ - నోట్‌ టేకింగ్‌ సాఫ్ట్‌వేర్‌

ఇదో సమర్థమైన నోట్‌ టేకింగ్‌ అప్లికేషన్‌. నోట్స్‌ను సృష్టించుకోవటానికి, ఇతర నోట్స్‌తో అనుసంధానం చేసుకోవటానికిది బాగా ఉపయోగపడుతుంది. దీంతో చాలా తేలికగా నోట్స్‌ తీసుకోవచ్చు. పాత ఎంట్రీలను త్వరగా రిఫర్‌ చేసుకోవచ్చు కూడా.


జీఐఎంపీ - ఫొటోషాప్‌ ప్రత్యామ్నాయం

ఆదరణ పొందిన ఓపెన్‌ సోర్స్‌ ఫొటో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్లలో జీఎంఐపీ ఒకటి. ఫొటోషాప్‌లో ఉన్న చాలా ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. అధునాతన ఏఐ ఫీచర్లు లేకపోయినప్పటికీ గ్రాఫిక్‌ డిజైన్లకు అవసరమైన సమగ్ర సదుపాయాలు దీని సొంతం. 


డావించీ రిజాల్వ్‌ - వీడియో ఎడిటింగ్‌ కోసం

వీడియో ఎడిటింగ్‌లో నైపుణ్యం లేనివారికి, నిపుణులకు ఇద్దరికీ డావించీ రిజాల్వ్‌ సరిపోతుంది. అత్యధిక నాణ్యమైన కలర్‌ కరెక్షన్‌ టూల్స్‌తో కూడిన ఇది 4కే రెజల్యూషన్‌ ఇమేజ్‌లనూ సపోర్టు చేస్తుంది. యూట్యూబ్‌ వంటి అన్‌లైన్‌ వేదికలకు కంటెంట్‌ను రూపొందించటానికి అనువుగా ఉంటుంది.


స్టీమ్‌ - గేమింగ్‌ సాఫ్ట్‌వేర్‌

దీన్ని పీసీ గేమర్లకు తప్పనిసరి వేదికని చెప్పుకోవచ్చు. ఆన్‌లైన్‌ స్టోర్‌గా ఉపయోగపడటంతో పాటు క్లౌడ్‌ సేవ్‌ సేవలనూ అందిస్తుంది. దీని ద్వారా స్నేహితులతో తేలికగా అనుసంధానం కావొచ్చు. గేమ్స్‌లో సాధించిన విజయాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయొచ్చు. పైగా ఇందులో బోలెడన్ని ఉచిత గేమ్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి.


ఆడాసిటీ - ఆడియో ఎడిటింగ్‌ తోడు

ఇదో విశిష్టమైన ఆడియో ఎడిటింగ్‌ టూల్‌. మ్యూజిక్‌ రికార్డింగ్, వాయిస్‌ ఓవర్స్, వీడియో ఆడియో పనుల కోసం బాగా ఉపయోగపడుతుంది. కొత్తవారికి, నిపుణులకు తగిన ప్రొఫెషనల్‌ స్థాయి ఫీచర్లను ఇది అందిస్తుంది.


హెచ్‌డబ్ల్యూఇన్ఫో- పీసీ పర్యవేక్షణకు

డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ వంటి పీసీల పర్యవేక్షణకు హెచ్‌డబ్ల్యూఇన్పో తప్పనిసరి. పరికరం ఉష్ణోగ్రతలు, వోల్టేజీలు, విద్యుత్తు వినియోగం వంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇది అందిస్తుంది. పీసీ సమర్థంగా పనిచేయటానికి చేదోడుగా నిలుస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని