పీసీ వేగంగా స్టార్ట్‌

కొత్త విండోస్‌ పీసీ కొద్ది సెకండ్లలోనే బూటప్‌ అవుతుంది. కానీ క్రమంగా నెమ్మదిస్తూ వస్తుంది. మరి పీసీ త్వరగా స్టార్టయ్యేలా చేయాలంటే? ఇందుకు కొన్ని ట్రిక్కులు లేకపోలేదు.

Published : 01 May 2024 00:03 IST

కొత్త విండోస్‌ పీసీ కొద్ది సెకండ్లలోనే బూటప్‌ అవుతుంది. కానీ క్రమంగా నెమ్మదిస్తూ వస్తుంది. మరి పీసీ త్వరగా స్టార్టయ్యేలా చేయాలంటే? ఇందుకు కొన్ని ట్రిక్కులు లేకపోలేదు. ఇవి చాలా సమయాన్ని ఆదా చేస్తాయి.

స్టార్టప్‌ యాప్‌ల డిసేబుల్‌

 ఆండ్రాయిడ్‌, ఏఓఎస్‌ మొబైల్‌ ఫోన్ల మాదిరిగానే విండోస్‌ పీసీలూ ఆన్‌ చేసిన ప్రతిసారీ కొన్ని ప్రోగ్రామ్‌లను స్టార్ట్‌ చేస్తాయి. కొత్త సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నప్పుడల్లా ఇవి వచ్చి చేరుతుంటాయి. పీసీ వేగాన్ని తగ్గిస్తుంటాయి. అయితే వీటిల్లో చాలావాటిని టాస్క్‌మేనేజర్‌ స్టార్టప్‌ విభాగం ద్వారా తేలికగా డిసేబుల్‌ చేసేయొచ్చు.

  • టాస్క్‌బార్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి లేదా కంట్రోల్‌, ఆల్ట్‌, డిలీట్‌ మీటలను కలిపి నొక్కి టాస్క్‌ మేనేజర్‌ను ఓపెన్‌ చేయాలి. ఇందులో పై బార్‌లో స్టార్టప్‌ ట్యాబ్‌ మీద నొక్కితే పీసీ స్టార్ట్‌ అయినప్పుడు లోడయ్యే యాప్‌ల జాబితా కనిపిస్తుంది.
  • వీటిల్లో చాలావాటిని డిసేబుల్‌ చేసినా ఇబ్బందేమీ ఉండదు కానీ కొన్ని ఫీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఆ ప్రోగ్రామ్‌ను ఓపెన్‌ చేసినప్పుడు నార్మల్‌గానే పనిచేస్తుంది. ఆయా యాప్‌ల పేరు మీద రైట్‌ క్లిక్‌ చేస్తే ఇంటర్నెట్‌లో అదేం చేస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ఎస్‌ఎస్‌డీకి అప్‌గ్రేడ్‌

పాత మెకానికల్‌ హార్డ్‌ డిస్క్‌లను సాలిడ్‌ స్టేట్‌ డ్రైవ్‌(ఎస్‌ఎస్‌డీ)కి అప్‌గ్రేడ్‌ చేసుకున్నా పీసీ స్టార్టయ్యే వేగం పుంజుకుంటుంది. పీసీ పని వేగమూ ఇనుమడిస్తుంది.  

హైబర్‌నేట్‌ లేదా స్లీప్‌

ఇవి పీసీని వేగంగా స్టార్ట్‌ చేయకపోవచ్చు గానీ కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేయకుండా గంట గంటకూ చెక్‌ చేసుకునేవారికి అనువుగా ఉంటాయి. ప్రస్తుత అధునాతన ల్యాప్‌టాప్‌లను మూసేస్తే వాటంతటవే స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. తిరిగి ఓపెన్‌ చేయగానే వెంటనే మామూలు స్థితికి వచ్చేస్తాయి. అయితే డెస్క్‌టాప్‌లకు స్లీప్‌ మోడ్‌ అంతగా సరిపడదు. ఇక్కడే హైబర్‌నేట్‌ ఆప్షన్‌ సాయం చేస్తుంది. దీన్ని ఎంచుకుంటే అప్పటివరకూ ఓపెన్‌ చేసి ఉన్న యాప్‌లన్నీ అలాగే ఉంటాయి. తిరిగి ఓపెన్‌ చేసినప్పుడు వెంటనే పని మొదలెట్టొచ్చు. అయితే ఈ ఆప్షన్‌ డిఫాల్ట్‌గా డిసేబుల్‌ అయ్యింటుంది. దీన్ని టర్న్‌ ఆన్‌ చేసుకోవాలంటే- స్టార్ట్‌ మెనూను ఓపెన్‌ చేసి కంట్రోల్‌ ప్యానెల్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇప్పుడు పవర్‌ ఆప్షన్స్‌లోకి వెళ్లి ‘చూస్‌ వాట్‌ ద పవర్‌ బటన్స్‌ డు’ ఎంచుకోవాలి. అనంతరం ‘ఛేంజ్‌ సెటింగ్స్‌ దట్‌ ఆర్‌ కరెంట్లీ అన్‌ఎవైలబుల్‌’ మీద క్లిక్‌ చేసి హైబర్‌నేట్‌ బాక్స్‌లో టిక్‌ పెట్టుకోవాలి. తర్వాత కింద కనిపించే సేవ్‌ ఛేంజెస్‌ బటన్‌ను నొక్కాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని