బహుబలి కెమెరా

అమెరికాలోని ఎస్‌ఎల్‌ఏసీ నేషనల్‌ యాక్సిలేటర్‌ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు.

Published : 10 Apr 2024 00:46 IST

అమెరికాలోని ఎస్‌ఎల్‌ఏసీ నేషనల్‌ యాక్సిలేటర్‌ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. 3,200 మెగాపిక్సెల్‌ సామర్థ్యం గల ఈ లెగసీ సర్వే ఆఫ్‌ స్పేస్‌ అండ్‌ టైమ్‌ (ఎల్‌ఎస్‌ఎస్‌టీ) కెమెరా చిన్న కారంత ఉంటుంది. బరువు 3వేల కిలోలు. దీన్ని త్వరలో చిలీలోని వెరా సి ర్యూబిన్‌ అబ్జర్వేటరీలో అమర్చనున్నారు. దక్షిణార్ధగోళ ఆకాశంలో కనిపించే దృశ్యాలను ఇది నిరంతరం చిత్రీకరిస్తుంది. కనిపించే ఆకాశం మొత్తాన్ని ప్రతి 3, 4 రాత్రులకు ఫొటోలు తీస్తుంది. దీని సాయంతో వచ్చే పదేళ్లలో 2,000 కోట్ల కొత్త నక్షత్రాలను గుర్తించొచ్చని ఆశిస్తున్నారు. ఇది ఆకాశాన్ని అత్యంత నాణ్యంగా, స్పష్టంగా ఫొటోలు తీయగలదు. గరిష్ఠ రెజల్యూషన్‌లో ఇది సృష్టించిన ఇమేజ్‌ను చూడాలంటే వందలాది అల్ట్రా హెచ్‌డీ టీవీ తెరలు అవసరమవుతాయి! సుదూర నక్షత్ర మండలాల నుంచి వచ్చే కాంతిని భారీ నక్షత్ర మండలాలు కాస్త వంచుతాయి. ఇలాంటి గురుత్వ లెన్సింగ్‌ సంకేతాలనూ ఎల్‌ఎస్‌ఎస్‌టీ కెమెరా గుర్తిస్తుంది. దీంతో ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకు అంతుపట్టని డార్క్‌ మ్యాటర్‌, డార్క్‌ ఎనర్జీ వంటి వాటి స్వభావాలు తెలియగలవని ఆశిస్తున్నారు. ఇది సౌర మండలంలోని చిన్న వస్తువుల పటాలను సవివరంగా రూపొందించగలదు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని