అక్షరదోషంతో గూగుల్‌!

రాస్తున్నప్పుడు అక్షరదోషాలు దొర్లటం మామూలే. తర్వాత ఎలాగూ సవరించుకుంటాం. కానీ అక్షరదోషంతో పుట్టుకొచ్చిన ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందితే? ఇంటర్నెట్‌కే ప్రత్యామ్నాయ పదంగా మారితే? గూగుల్‌ అలాంటిదే.

Published : 16 Nov 2022 00:27 IST

రాస్తున్నప్పుడు అక్షరదోషాలు దొర్లటం మామూలే. తర్వాత ఎలాగూ సవరించుకుంటాం. కానీ అక్షరదోషంతో పుట్టుకొచ్చిన ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందితే? ఇంటర్నెట్‌కే ప్రత్యామ్నాయ పదంగా మారితే? గూగుల్‌ అలాంటిదే. దీన్ని స్థాపించిన ల్యారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ మొదట్లో తమ సెర్చ్‌ ఇంజిన్‌ను ‘బ్యాక్‌రబ్‌’ అని పిలుచుకునేవారు. వెబ్‌ నేపథ్య లింకులను విశ్లేషిస్తుంది కాబట్టి అదైతే సరిపోతుందని అనుకున్నారు. కానీ అంతకన్నా మంచి పేరుంటే బాగుంటుందని బాగా ఆలోచించారు. మిగతావారితో సంప్రదించి గూగోల్‌ప్లెక్స్‌ అనే పదాన్ని ఖాయం చేశారు. అయితే కాస్త పొట్టిగా ఉంటే మేలని ల్యారీ ‘గూగోల్‌’ అని మార్చారు. ఒకటి తర్వాత 100 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యను గూగోల్‌ అంటారు. భారీ సెర్చ్‌ ఇంజిన్‌ను రూపొందించటం తమ లక్ష్యం కాబట్టి అదైతే సరిగ్గా సరిపోతుందని భావించారు. ఇంటర్నెట్‌ డొమైన్‌ నేమ్‌ రిజిస్ట్రీలో అందుబాటులో ఉందో లేదో చూసే సమయంలో google.com అని సెర్చ్‌ చేశారు. అది అందుబాటులో ఉండటం.. ల్యారీ, సెర్గీకి ఇంకాస్త బాగుందని అనిపించటంతో చివరికి దాన్నే ఖాయం చేసేశారు. అనంతరం ఇదెంత ఆదరణ పొందిందనేది అందరికీ తెలిసిందే. దీని ప్రాచుర్యాన్ని గుర్తించే 2006లో ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఈ పదాన్ని చేర్చారు. ‘ఇంటర్నెట్‌లో సమాచారాన్ని పొందటానికి గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను వాడుకోవటానికి’ అని దానికి అర్థంగా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని