వంతెనలకు ‘స్మార్ట్‌’ భద్రత!

స్మార్ట్‌ఫోన్లు వ్యక్తిగత అవసరాలకే కాదు.. కట్టడాల భద్రతకూ ఉపయోగపడతాయి! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనని నిరూపించారు అమెరికాలోని వెస్ట్‌ పాయింట్‌ మిలిటరీ అకాడమీ, ఇతర యూనివర్సిటీల పరిశోధకులు.

Updated : 18 Jan 2023 07:24 IST

స్మార్ట్‌ఫోన్లు వ్యక్తిగత అవసరాలకే కాదు.. కట్టడాల భద్రతకూ ఉపయోగపడతాయి! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనని నిరూపించారు అమెరికాలోని వెస్ట్‌ పాయింట్‌ మిలిటరీ అకాడమీ, ఇతర యూనివర్సిటీల పరిశోధకులు. వంతెనల భద్రతను త్వరగా, తేలికగా, చవకగా పర్యవేక్షించే విధానాన్ని రూపొందించారు మరి. ఇందుకు స్మార్ట్‌ఫోనే వేదిక కావటం గమనార్హం. సాధారణంగా వంతెనల మన్నికను రెండు రకాలుగా పరిశీలిస్తుంటారు. ఇంజినీర్లు స్వయంగా పరిశీలించి పగుళ్లు ఏవైనా ఏర్పడ్డాయేమో చూస్తారు. లేదూ సెన్సర్లు అందించే కంపనాలు, కదలికల సమాచారంతో అంచనా వేస్తుంటారు. వీటితో పనిలేకుండా వంతెనల మీద ప్రయాణించే వాహనదారుల స్మార్ట్‌ఫోన్లలోని యాక్సెలోమీటర్లతోనే సమాచారాన్ని సేకరించటం తాజా విధానంలో కీలకాంశం. దీన్ని శాన్‌ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి…, ఇటలీలోని ఒక కాంక్రీటు వంతెన మీద పరీక్షించి చూశారు కూడా. ఇవి వంతెనల మీద అమర్చిన సెన్సర్ల మాదిరిగానే కచ్చితమైన సమాచారాన్ని అందించటం విశేషం. వంతెనల మీద వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు సహజంగా పుట్టుకొచ్చే కంపనాలను ఫోన్లలోని యాక్సెలోమీటర్లు పసిగడతాయి. వంతెనల్లో తలెత్తుతున్న మార్పులను అంచనా వేయటానికివి ఉపయోగపడతాయి.  ఈ సమాచారం ఆధారంగా సమయానుకూలంగా మరమ్మతులు చేస్తే వంతెనల జీవనకాలం 30% వరకు పెరిగే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. వంతెనలను పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయటం చాలా కీలకం. లేకపోతే ప్రమాదాలు జరగొచ్చు. ఇటీవల గుజరాత్‌లోని వంతెన కూలిపోయి 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. తేలికైన, చవకైన స్మార్ట్‌ఫోన్‌ విధానంతో ఇలాంటి ప్రమాదాలను ముందే పసిగడితే.. పెను ప్రమాదాలు జరగకుండా నివారించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని