చాట్‌జీపీటీతో ప్రయోగాలు

ప్రత్యుత్తర కృత్రిమ మేధ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. దీంతో ఎంతోమంది కొత్త కొత్త ప్రయోగాలూ చేస్తున్నారు.

Updated : 12 Apr 2023 03:11 IST

ప్రత్యుత్తర కృత్రిమ మేధ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. దీంతో ఎంతోమంది కొత్త కొత్త ప్రయోగాలూ చేస్తున్నారు. దీనికి కొన్ని తాజా ఉదాహరణలు ఇవీ..

కవితా పంక్తుల గడియారం!

చాట్‌జీపీటీ ప్రయోగాలకు కాదేదీ అనర్హమన్నట్టుగా మారింది. మాట్‌ వెబ్‌ అనే డిజైనర్‌, బ్లాగర్‌ రూపొందించిన ఇ-ఇంక్‌ గడియారం దీనికి ఓ ఉదాహరణ. ఇది ప్రతి నిమిషానికీ రెండు పంక్తుల కవితతో సమయాన్ని సూచిస్తుంది మరి. గతంలో టెక్స్ట్‌ గడియారం తయారీకి వాడిన పాత ఇంకీ వాట్‌ స్క్రీన్‌, రాస్ప్‌బెర్రీ పైతోనే దీన్ని సృష్టించారు. మాట్‌ కొద్దిరోజులుగా ఓపెన్‌ఏఐకి చెందిన భాషా నమూనాలతో ప్రయోగాలు చేస్తున్నారు. భాషా నమూనా, సమయం.. రెండింటినీ జోడిస్తే? ఎలా ఉంటుందనే ఆలోచన మొగ్గ తొడిగింది. వెంటనే ఆచరణలో పెట్టేశారు. ఈ గడియారం ఓపెన్‌ఏఐకి చెందిన ఏపీఐని వాడుకుంటుంది. దీనికి సమయం ఒక్కటే మాట సాయం (ప్రాంప్ట్‌) చేస్తుంది. ఈ ప్రాంప్ట్‌ కృత్రిమ మేధకు సూచనలు ఇచ్చి, కవిత రూపంలో స్పందించేలా ప్రేరేపిస్తుంది. కవితలో భాగంగానే సమయాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు- 11.38 అయ్యిందనుకోండి. ‘‘ఎలెవన్‌ థర్టీ ఎయిట్‌, డోన్ట్‌ హెసిటేట్‌. టైమ్‌ టు సేవర్‌ లైఫ్‌, డోన్ట్‌ బీ లేట్‌’ అని గడియారం మీద చూపిస్తుంది. అంతకుముందు నిర్దేశించిన జాబితాలోంచి కాదు, ఇది ప్రతిసారీ కొత్త కవితను సృష్టించటం విశేషం. దీని ప్రాంప్ట్‌ గడియారం ఎక్కడుందో, గదిలో పరిసరాల వివరాలనూ ఛాట్‌జీపీటీకి అందిస్తుంది. అంటే భౌతికంగా ఉన్నట్టుగానూ సంభాషిస్తుంది. ఉదాహరణకు- ‘ఇన్‌ కోజీ షెల్వ్స్‌, ఐ డు రిసైడ్‌. ఇట్స్‌ నియర్లీ నూన్‌, ద క్లాక్‌ కాన్ఫయిడ్స్‌’ అని వివరిస్తుంది. ఈ ప్రాజెక్టును ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటానికీ మాట్‌ ప్రయత్నిస్తున్నారు.


ఎఐన్‌స్టీన్‌ రోబో

చాట్‌జీపీటీతో విద్యార్థులూ ప్రయోగాలు చేస్తున్నారు. దీని సాయంతో సైప్రస్‌లోని హైస్కూలు విద్యార్థులు కృత్రిమ మేధ రోబోను సృష్టించారు. దీనికి ఎఐన్‌స్టీన్‌ (AInstein)అని పేరు పెట్టారు. ఇది చర్చిస్తుంది. టెక్స్ట్‌ అంశాలను సృష్టిస్తుంది. జోక్స్‌ వేస్తుంది. మామూలు మనిషి సైజులో ఉండే ఈ రోబో ఉత్తర అమెరికా ఇంగ్లిష్‌ యాసలో మాట్లాడుతుంది. గ్రీక్‌లో మాట్లాడటానికీ ప్రయత్నిస్తుంది. దీనికి ముఖం భాగంలో తెర ఉంటుంది. దీని ద్వారా మనిషి ముఖ కవళికలనూ వ్యక్తం చేస్తుంది. కృత్రిమ మేధకు మనుషులు భయపడాలా? అనే ప్రశ్నకు ఇదేం సమాధానం చెప్పిందో తెలుసా? ‘‘కృత్రిమ మేధను సృష్టించింది మనుషులే. నియంత్రించేదీ వారే. దీని అభివృద్ధి, అమలు మెరుగైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడేలా చూడటమన్నది మనుషుల చేతుల్లో ఉంది’’ అని వివరించింది. కృత్రిమ మేధకు భయపడాల్సిన పని లేదు గానీ దీన్ని జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వాడుకోవాలని సూచించింది. నిజమే కదా. ‘‘గణితం ఎందుకు విచారిస్తుంది? దీనికి చాలా సమస్యలున్నాయి కాబట్టి’’ అని జోక్‌ వేస్తుంది. ఇది విద్యార్థులు వేసే ప్రశ్నలకూ స్పందిస్తుంది. ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతాన్నీ బొమ్మల రూపంలో వివరిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మున్ముందు కృత్రిమ మేధ వంటి అధునాతన పరిజ్ఞానాలతో కొత్త అవకాశాలను ఎలా సృష్టించుకోవచ్చో, లెర్నింగ్‌ ప్రక్రియలను ఎలా మెరుగుపరచుకోవచ్చో అనటానికి ఈ రోబో మంచి ఉదాహరణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని