పీసీ ‘రక్షణ’ కోటలు!

పీసీని వైరస్‌ల బారిన పడకుండా యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్స్‌ కాపాడతాయి. అయితే బోలెడన్ని యాంటీ వైరస్‌లలో ఏది మంచిదో తేల్చుకోవటం కాస్త కష్టమైన పనే.

Updated : 06 Sep 2023 06:33 IST

పీసీని వైరస్‌ల బారిన పడకుండా యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్స్‌ కాపాడతాయి. అయితే బోలెడన్ని యాంటీ వైరస్‌లలో ఏది మంచిదో తేల్చుకోవటం కాస్త కష్టమైన పనే. ఇలాంటి సందేహంతోనే మీరూ కొట్టుమిట్టాడుతున్నారా? అయితే విండోస్‌ పీసీ కోసం కొన్ని దృఢమైన, నమ్మకమైన యాంటీ వైరస్‌ల గురించి తెలుసుకోవటం మంచిది.

కాస్‌పర్‌స్కీ ఇంటర్నెట్‌ సెక్యూరిటీ

ఆన్‌లైన్‌ సెక్యూరిటీ ప్రపంచంలో కాస్‌పర్‌స్కీ పేరు తెలియంది కాదు. ఇది యాంటీవైరస్‌, కాస్‌పర్‌స్కీ ఇంటర్నెట్‌ సెక్యూరిటీ, సెక్యూరిటీ క్లౌడ్‌ పేరుతో మూడు సూట్లను అందిస్తుంది. ఇవన్నీ విండోస్‌ 10 పరికరాలకు మంచి రక్షణ కల్పించేవే. వీటిల్లో కాస్‌పర్‌స్కీ ఇంటర్నెట్‌ సెక్యూరిటీ ఒకింత మెరుగని చెప్పుకోవచ్చు. దీన్ని 16 లక్షల నమూనాల మీద పరీక్షించగా కేవలం మూడింటిలోనే ఫాల్స్‌ పాజిటివ్‌గా.. అంటే వైరస్‌ లేకపోయినా ఉన్నట్టు గుర్తించింది. ఇందులో ఉచిత వర్షన్‌తో పాటు పెయిడ్‌ వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.


మైక్రోసాఫ్ట్‌ డిఫెండర్‌

ఇది డిఫాల్ట్‌గానే విండోస్‌ పరికరాలకు అందుబాటులోకి వస్తుంది. ఒకప్పటితో పోలిస్తే చాలా మెరుగైంది. సిస్టమ్‌ వనరుల వేగం తగ్గిస్తుందని, నాసిరకం రక్షణ కల్పిస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడిది విండోస్‌ 10 పీసీకి దృఢమైన రక్షణ కల్పించేలా మారిపోయింది. దీంతో తేలికగా వైరస్‌ ప్రొటెక్షన్‌, ఫైర్‌వాల్‌ ప్రొటెక్షన్‌, డివైస్‌ సెక్యూరిటీని నిర్వహించుకోవచ్చు.


మాల్వేర్‌బైట్స్‌ ప్రీమియం

విండోస్‌ పరికరాలకు ఇది మరో మంచి యాంటీవైరస్‌ అప్లికేషన్‌. దీని ఉచిత వర్షన్‌ చాలా సంవత్సరాల నుంచి ఆదరణ పొందింది. అయితే అన్నివేళలా మంచి భద్రత కావాలంటే ప్రీమియం వర్షన్‌ను కొనుక్కోవటం మంచిది. ఎంట్రీ లెవల్‌ ప్లాన్స్‌ ఒక్క పరికరానికే ఉపయోగపడతాయి. ఐడెంటిటీ థెఫ్ట్‌, ర్యాన్‌సమ్‌వేర్‌, ఫ్రాడ్యులెంట్‌ వెబ్‌సైట్స్‌, మాల్వేర్‌ వంటి వాటి నుంచి కాపాడుతుంది.


బిట్‌డిఫెండర్‌ ఇంటర్నెట్‌ సెక్యూరిటీ

విండోస్‌ పీసీల కోసం అత్యుత్తమ యాంటీవైరస్‌లలో దీన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇందులో టోటల్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ సెక్యూరిటీ, యాంటీవైరస్‌ ప్లస్‌ వర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కావాలనుకుంటే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలు వేర్వేరుగానూ బిట్‌డిఫెండర్‌ వర్షన్లు కొనుక్కోవచ్చు. పలు అంచెల్లో ర్యాన్‌సమ్‌వేర్‌ రక్షణ కల్పించటం దీని ప్రత్యేకత. నెట్‌వర్క్‌ థ్రెట్‌ నివారణ, పేరెంట్‌ కంట్రోల్స్‌ సదుపాయాలూ ఉంటాయి. కొనుక్కోవటం ఇష్టం లేనివారు 30 రోజుల వరకు ఉచితంగా వాడుకోవచ్చు.


మెకాఫీ టోటల్‌ ప్రొటెక్షన్‌

యాంటీవైరస్‌ రంగంలో ఎప్పట్నుంచో ఉన్నది, మంచి ప్రాచుర్యం పొందింది ఇదే. విండోస్‌ మాల్వేర్‌ ప్రొటెక్షన్‌ అవసరాలన్నింటికీ ఉపయోగపడుతుంది. ఫైర్‌వాల్‌, పాస్‌వర్డ్‌ మేనేజర్‌, ఫైల్‌ ష్రెడర్‌, వెబ్‌ ప్రొటెక్షన్‌, ఆన్‌లైన్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌ వంటి ఫీచర్లను కల్పిస్తుంది. ఈమెయిల్‌, ఎస్‌ఎస్‌ఎన్‌, బ్యాంకు ఖాతాల పర్యవేక్షణలోనూ సాయం చేస్తుంది. ఇందులో నాలుగు ప్లాన్లు ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవటానికి ముందు 30 రోజులు ఉచితంగా వాడుకునే సదుపాయమూ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని